- ఏపీ నుంచి తెలంగాణకు సన్న వడ్లు
- ఏపీలో తక్కువ ధరకు కొనుగోలు చేసి ఐకేపీలో రైతుల పేరిట అమ్మకాలు
- 15 రోజుల్లో 70 లారీలు పట్టుకున్న పోలీసులు
నల్గొండ, వెలుగు: రాష్ట్రంలో సన్న వడ్లకు క్వింటాకు రూ.500 ప్రభుత్వం బోనస్ ఇస్తుండడంతో ఏపీ నుంచి అక్రమంగా వడ్లు తరలిస్తున్నారు. ఏపీ నుంచి భారీగా సన్న వడ్లను తీసుకువచ్చి ఐకేపీ కేంద్రాల్లో అమ్ముతున్నారు. మిల్లర్లు దళారులతో కుమ్మక్కై ఈ దందా కొనసాగిస్తున్నారనే విమర్శలున్నాయి.
ఏపీలో వర్షాలు కురుస్తుండడంతో తేమ శాతం ఎక్కువగా వస్తోంది. దీనిని సాకుగా చూపించి అక్కడి రైతులకు మద్దతు ధర ఇవ్వడం లేదు. దీంతో కొంత మంది దళారులు పెద్ద ఎత్తున సన్న వడ్లను తక్కువ ధరకు కొనుగోలు చేసి తెలంగాణలోకి తీసుకువచ్చి అమ్ముకుంటున్నారు.
మద్దతు ధరతో పాటు బోనస్ వస్తుండడంతో..
తెలంగాణ ప్రభుత్వం సన్న వడ్లకు క్వింటాలుకు రూ.2,320 మద్దతు ధర కల్పిస్తుండగా, సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇస్తోంది. దీంతో ఏపీలో పెద్ద మొత్తంలో వడ్లను కొంటున్న వ్యాపారులు తెలంగాణకు తీసుకువచ్చి అమ్ముకుంటున్నారు. నల్గొండ, సూర్యాపేట జిల్లాలోని చండూరు, కొండమల్లేపల్లి, మిర్యాలగూడ, తిరుమలగిరి, కోదాడ, హుజూర్ నగర్ మిల్లులకు వడ్లను తరలిస్తున్నారు. అక్కడి నుంచి రైతుల ముసుగులో వడ్ల కొనుగోలు కేంద్రాలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు.
లారీలను అడ్డుకుంటున్న రైతులు..
తెలంగాణలోని రవాణా శాఖ చెక్‌పోస్టులను ప్రభుత్వం ఎత్తివేయడం, వ్యవసాయ మార్కెట్ కమిటీల చెక్‌పోస్టులు లేకపోవడం, ఏపీ పర్మిట్ లారీలు తెలంగాణలోకి ప్రవేశించినా అడ్డుకునే వ్యవస్థ లేకపోవడం వంటి కారణాలతో వడ్ల లారీలు ఈజీగా సరిహద్దు దాటుతున్నాయి. వారం రోజులుగా ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం కట్టుకాసారం రైతులు ఏపీ నుంచి వస్తున్న లారీలను అడ్డుకుంటుండగా, నల్గొండ, సూర్యాపేట జిల్లాలోని బార్డర్ వద్ద పోలీసులు రాష్ట్రంలోకి వస్తున్న లారీలను పట్టుకున్నారు.
గత 15 రోజుల్లోనే ఖమ్మం, నల్గొండ జిల్లాల పరిధిలో 70కి పైగా లారీలను పట్టుకొని కేసులు నమోదు చేశారు. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం దొండపాడు చెక్ పోస్ట్ వద్ద 15 లారీలు, మిర్యాలగూడ మండలం ఆలగడప టోల్ గేట్ వద్ద ఏపీకి చెందిన 11 లారీలు పోలీసులకు పట్టుబడ్డాయి.
దళారులతో కుమ్మక్కు..
ఏపీ నుంచి తెలంగాణకు వస్తున్న సన్న వడ్లను కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకునేందుకు ఐకేపీ కేంద్రాల నిర్వాహకులతో దళారులు కుమ్మక్కయ్యారనే విమర్శలున్నాయి. ఏపీ నుంచి మిర్యాలగూడ మిల్లులకు వడ్లను తరలిస్తున్నట్లు పేపర్లు చూపించి కొనుగోలు కేంద్రాలకు తరలిస్తున్నారు. ఇందుకు కొంతమంది మిల్లర్లు సహకరిస్తుండడంతో యథేచ్ఛగా బార్డర్ దాటించి జిల్లాలోకి వడ్లు తీసుకువస్తున్నారు.
ఆ వడ్లను ఇక్కడి రైతుల పేరుపై ఐకేపీ కేంద్రాల్లో అమ్ముకుంటున్నారు. దీనికి కేంద్రాల నిర్వహకులు సహకరిస్తున్నారనే విమర్శలున్నాయి. ఇలా అమ్ముకున్న వడ్ల పైసలను నేరుగా దళారుల అకౌంట్ లో పడేలా చూస్తున్నారు. దళారులు తమ అకౌంట్ నంబర్లను ట్యాబ్ లో ఎంట్రీ చేయించి డబ్బులు జమ చేయించుకుంటున్నారు. ఇటీవల మిర్యాలగూడ మండలం అవ౦తిపురం పీఏసీఎస్ 1 సెంటర్లో రైతుల నుంచి కొనుగోలు చేసినట్లు ట్రక్ షీట్ సృష్టించి మిల్లుకు వడ్లు తరలించడంతో ఇద్దరు ఉద్యోగులను కలెక్టర్ ఇలా త్రిపాఠి సస్పెండ్ చేశారు.
ఏపీ టు తెలంగాణ..
ఏపీలోని విజయవాడ, తెనాలి వ్యాపారులు తెలంగాణలోని కొందరు మిలర్లు, దళారులతో కుమ్మక్కై ఈ దందా సాగిస్తున్నట్లు తెలుస్తోంది. విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం నుంచి ఎన్‌టీఆర్ జిల్లా గండ్రాయి మీదుగా కొన్ని లారీలు చెరువు మాధారానికి చేరుకుంటున్నాయి. ఇక్కడి నుంచి లారీలను ఖమ్మం–కోదాడ హైవే ఎక్కించి మిర్యాలగూడకు తరలిస్తున్నారు.
ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా నుంచి వాడపల్లి, మట్టంపల్లి మీదుగా మిర్యాలగూడ ప్రాంతాలకు భారీగా సన్న వడ్లు తరలిస్తున్నారు. ఏపీలోని తెనాలి, మచిలీపట్నం, పామర్రు ప్రాంతాల నుంచి కూడా తెలంగాణకు భారీగా సన్న వడ్లు వస్తున్నట్లు సమాచారం. అయితే ప్రధాన రహదారిపై తనిఖీలు చేస్తుండడంతో లారీలను అడ్డ దారిలో సూర్యాపేట, నల్లగొండ జిల్లాలకు తరలిస్తున్నారు.
