రోడ్ల మీదే వడ్ల కుప్పలు.. రైతుల్లో ఆందోళన  

రోడ్ల మీదే వడ్ల కుప్పలు.. రైతుల్లో ఆందోళన  

రైతులు పండించిన వడ్లు రోడ్ల మీదనే కుప్పలుగా పేరుకుపోతున్నాయి. మెషీన్లతో కోసిన వడ్లలో తేమ శాతం అధికంగా ఉండడంతో వ్యాపారులు కొనడం లేదు. దీంతో ఎండపోయాల్సి వస్తోంది. ఇంకా చాలా చోట్ల ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించలేదు. ఇప్పటివరకు 30 శాతం వడ్లు కూడా కొనలేదు. దాదాపు యాభై లక్షల టన్నుల వడ్లు ఇంకా రోడ్లపైన, సెంటర్లలోనే ఉన్నాయి. కాస్త మబ్బు పట్టి మొగులైనా వడ్లు తడుస్తాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలో రైతులు పండించిన వడ్లు రోడ్ల మీదనే కుప్పలు తెప్పలుగా పేరుకుపోతున్నాయి. ఎక్కడ చూసినా వడ్ల కుప్పలు, ఆరబోసిన వడ్లే కన్పిస్తున్నాయి. రోడ్ల మీదే రైతులు వడ్లను తూర్పారపడుతూ, చెరుగుతూ, జల్లెడ పడుతూ, పడిగాపులు కాస్తూ.. రోజుల తరబడి కష్టాలు పడుతున్నారు. చాలా ఊళ్లల్లో వడ్లను అమ్ముకునేందుకు రైతులు ఎదురుచూడాల్సిన దుస్థితి నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం వడ్ల కొనుగోళ్లు మొదలుపెట్టి నెల దాటినా ఇప్పటివరకు 30 శాతం వడ్లు కూడా కొనలేదు. దాదాపు 50 లక్షల టన్నుల వడ్లు ఇంకా రోడ్లపైనే, సెంటర్లలోనే ఉన్నాయి. కొనుగోళ్లలో ఆలస్యం, తాలు పేరిట దోపిడీతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కొన్ని చోట్ల వడ్లు కాంటా అయి పది రోజులైనా మిల్లులకు చేరడం లేదు.

రోడ్ల మీదే కుప్పలు.. రైతుల్లో ఆందోళన  

వరంగల్‌‌ జిల్లా నర్సంపేట్‌‌ నుంచి మహబుబాబాద్‌‌ వెళ్లే రహదారిలో వజినపల్లి, బుధరావుపేట, మంగళారపుపేట, వేపచెట్టుతండా, భూపతిపేట, మర్రిమిట్ట, గూడురు, బ్రాహ్మణపల్లి, మచ్చర్ల, గండితండ, బొద్దుగొండ, సికింద్రాబాద్‌‌ తండా, నక్కబండ, సండ్రాళ్లగూడెం గ్రామాల్లో ఎక్కడ చూసినా రోడ్ల మీద ఆరబోసిన వడ్లు కిలోమీటర్ల పొడవునా దర్శనవిమస్తున్నాయి. మహబుబాబాద్‌‌ జిల్లా కేంద్రం నుంచి మరిపెడ బంగ్లా రోడ్‌‌లోనూ అయ్యగారిపల్లి, పురుషోత్తాయగూడెం, కందికొండ, అబ్బాయపాలెం, గాలివారి గూడెం.. మరిపెడ బంగ్లా నుంచి నకిరేకల్‌‌ రహదారిలో సూర్యాపేట జిల్లాలోని ఊళ్లలోనూ రోడ్ల మీద ఎక్కడ చూసినా ఆరబోసిన వడ్లే కనిపిస్తున్నాయి. జనగామ జిల్లాలోనూ దారి పొడవునా ధాన్యపు రాశులే ఉన్నాయి. మబ్బులు పట్టి మొగులైనా.. చిన్న చినుకులు పడినా.. రైతులు కలవరపడాల్సి వస్తున్నది. కొన్ని ప్రాంతాల్లో మిల్లులకు పర్మిషన్‌‌ రాలేదని కొంటలేరని రైతులు వాపోతున్నారు.  

వెయ్యి సెంటర్లు ఇంకా ఓపెన్ కాలే  

ఈ సీజన్‌‌లో కోటిన్నర లక్షల టన్నుల వడ్లు మార్కెట్​కు వస్తాయని ప్రభుత్వం అంచనా వేసింది. కోటి టన్నులు కొంటామని చెప్పి, అక్టోబర్​22 నుంచి కొనుగోళ్లు మొదలుపెట్టింది.  7,179 కొనుగోలు సెంటర్లు ఓపెన్‌‌ చేయాలని నిర్ణయించగా, 6,246 సెంటర్లను మాత్రమే ప్రారంభించారు. ఇందులో 39 సెంటర్లలో కొనుగోళ్లు పూర్తయ్యాయి. నాట్లు ఆలస్యంగా వేసిన వరంగల్‌‌, మహబూబాబాద్‌‌, ఖమ్మం జిల్లాతోపాటు మరికొన్ని జిల్లాల్లో ఇప్పుడిప్పడే కోతలు షురూ అయి వడ్లు మార్కెట్‌‌కు వస్తున్నాయి. 

కొనుగోళ్లు పూర్తయ్యేదెప్పుడు? 

రాష్ట్రంలో ఎక్కువగా నిజామాబాద్‌‌‌‌లో 4.56 లక్షల టన్నుల వడ్లు కొన్నరు. కామారెడ్డిలో 3.19 లక్షల టన్నులు, మెదక్‌‌ జిల్లాలో 2.64 లక్షలు, నల్గొండలో 2.46 లక్షలు, యాదాద్రిలో 1.94 లక్షలు, కరీంనగర్‌‌లో 1.58 లక్షలు, జగిత్యాలలో 1.52 లక్షలు, సిద్దిపేటలో 1.50 లక్షలు, సంగారెడ్డి 1.30 సూర్యాపేటలో 1.14 లక్షల టన్నులు కొన్నారు. ఇప్పటివరకు మొత్తం 27.36 లక్షల టన్నుల వడ్లు కొన్నారు. మిగతా 70 లక్షల టన్నుల వడ్లను కొనడానికి ఇంకా ఎంత టైం పడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఇట్లయితే తమ వడ్లు ఎప్పుడు కొంటరోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.

 సెంటర్ తెర్సినా.. కొంటలేరు 

ఐదెకరాల పొలం కోసినం. వడ్లు ఎండవెడుతున్నం. మా ఊర్లో సెంటర్‌‌ తెరిచిన్రు. కానీ కొంటలేరు. మిల్లులకు పర్మిషన్‌‌ రాలేదంట. అందుకే కొనటంలేదని చెప్తున్నరు. వడ్లను కొనేదాకా ఎండ బెట్టుడు..కుప్ప పోసుడే సరిపోతాంది. 
- గుండ రవి, ధర్మారావుపేట, ఖానాపురం మండలం, వరంగల్‌‌ జిల్లా