బెంగళూరు: ఆల్‌రౌండ్ షోతో ఆకట్టుకున్న డిఫెండింగ్ చాంపియన్ కర్నాటక.. వరుసగా నాలుగోసారి విజయ్ హజారే ట్రోఫీ సెమీస్‌లోకి ప్రవేశించింది. ఛేజింగ్‌లో దేవదత్ పడిక్కల్ (81 నాటౌట్), కరుణ్ నాయర్ (74 నాటౌట్) దంచికొట్టడంతో.. సోమవారం జరిగిన క్వార్టర్‌ఫైనల్లో కర్నాటక 55 రన్స్ తేడాతో (వీజేడీ పద్ధతి) ముంబైపై నెగ్గింది. టాస్ ఓడిన ముంబై 50 ఓవర్లలో 254/8 స్కోరు చేసింది. శామ్స్ ములానీ (86) టాప్ స్కోరర్. సిద్ధేశ్ లాడ్ (38), సాయిరాజ్ పాటిల్ (33 నాటౌట్), అంగ్‌క్రిష్ రఘువంశీ (27), ఇషాన్ మూల్‌చందానీ (20) రాణించారు.
వ్యక్తిగత కారణాలతో పేసర్ తుషార్ దేశ్‌పాండేతో పాటు నెట్ ప్రాక్టీస్ వేలి గాయానికి గురైన స్టార్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ ఈ మ్యాచ్‌లో ఆడకపోవడం ముంబైని దెబ్బతీసింది. కర్నాటక బౌలర్లు విద్యాదరి పాటిల్ (3/42), విద్వత్ కావేరప్ప (2/43), అభిలాష్ షెట్టి (2/59) దెబ్బకు ముంబై ఓ దశలో 60/4తో కష్టాల్లో పడింది. అయితే ములానీ, లాడ్ ఐదో వికెట్‌కు 76 రన్స్ జోడించడంతో ముంబై ఆమాత్రం స్కోరైనా చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కర్నాటక 33 ఓవర్లలో 187/1 స్కోరు చేసింది. ఈ దశలో భారీ వర్షం వల్ల మ్యాచ్‌కు అంతరాయం కలిగింది. అయితే వీజేడీ పద్ధతి ప్రకారం ఎక్కువ స్కోరు చేసిన కర్నాటకను విన్నర్‌గా ప్రకటించారు. కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (12) ఫెయిలైనా.. పడిక్కల్, కరుణ్ రెండో వికెట్‌కు 143 రన్స్ జోడించి ఈజీగా గెలిపించారు. పడిక్కల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
