ఎకరాకు రూ.25 వేలు చెల్లించాలి : ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి

ఎకరాకు రూ.25 వేలు చెల్లించాలి : ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి
  • మాజీ ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్ రెడ్డి, శశిధర్​రెడ్డి

పాపన్నపేట, వెలుగు: భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేలు, ప్రాణాలు కోల్పోయిన వారికి రూ.25 లక్షల చొప్పున చెల్లించాలని మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి డిమాండ్​చేశారు. ఆదివారం మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్ రెడ్డితో కలిసి పాపన్నపేట మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో వరదల వల్ల దెబ్బతిన్న పొలాలు, రోడ్లును  పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ పాపన్నపేట మండల పరిధిలో చాలా గ్రామాల్లో రైతులు పంట నష్టపోయారని, రోడ్లు, బ్రిడ్జిలు తెగిపోయినా తహసీల్దార్ కానీ  ఏఈలు కానీ స్పందించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. 

సంబంధిత అధికారులు ఇప్పటికైనా సంఘటన స్థలాలకు వెళ్లి సర్వే చేసి ప్రభుత్వానికి నివేదిక అందించాలని, ప్రభుత్వం రైతులకు ఎంత పరిహారం అందిస్తుందో ప్రకటన విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు ఎల్లాపూర్, ఆరేపల్లి, కుర్తివాడ, మిన్పూర్, ముద్దాపూర్, రామతీర్థం తదితర గ్రామాల్లో దెబ్బతిన్న పొలాలను పరిశీలించి రైతులను పరామర్శించారు. వారి వెంట పార్టీ మండల అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి, సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షుడు కుమ్మరి జగన్, సోములు, లింగారెడ్డి, కుబేరుడు, బాబా గౌడ్, కిష్టా గౌడ్, సంజీవరెడ్డి, బ్రహ్మం, ఆంటోనీ, సాయిరెడ్డి,  రైతులు ఉన్నారు.