గల్ఫ్ కార్మికులకు పెయిడ్ క్వారంటైన్

గల్ఫ్ కార్మికులకు పెయిడ్ క్వారంటైన్

రూ.8వేల చొప్పున కడితేనే టికెట్ కన్ఫర్మేషన్
డబ్బులు కట్టేస్థోమత లేనివారికి మొదట్లో ఫ్రీ క్వారంటైన్‍
అప్పట్లో పైసా తీసుకోబోమని ప్రామిస్ చేసిన మంత్రి ప్రశాంత్ రెడ్డి
సర్కారు మాట తప్పిందంటున్న మైగ్రెంట్స్

నాపేరు అనిల్. మాది నిజామాబాద్ జిల్లా భీమ్‍గల్ మండలం పిప్రి గ్రామం. ఏడేళ్లుగా నేను బహ్రెయిన్ లోని ఓ కంపెనీలో క్లర్క్ గా పనిచేస్తున్న. కరోనా కారణంగా చాలా రోజులుగా పనిలేకుండా ఉన్నాం. ఇండియాకు వచ్చేందుకు ఇండియన్ కరెన్సీ రూ. 24 వేలు చెల్లించి ఫ్లయిట్ టికెట్‍ బుక్ చేసుకున్న. ప్యాసింజర్స్ ఫిల్‍ అప్‍ కాకపోవడంతో నాకు ఇచ్చిన ట్రావెల్ డేట్ పోస్ట్ పోన్ అయ్యింది. ఇప్పుడు నాకు మరో రూ. 8 వేలు హైదరాబాద్‍లో క్వారంటైన్ చార్జీల కోసం చెల్లించాలంటున్నరు. అవి చెల్లించకపోతే టికెట్ ఇష్యూ చేయడం కుదరదని చెపుతున్నరు. తెలంగాణ గవర్నమెంట్‍ టికెట్ బుకింగ్ ఏజెన్సీకి పంపిన ఈమెయిల్ మెసేజ్ ను కూడా చూపిస్తున్నరు.

నిజామాబాద్, వెలుగు: ఉన్న ఊళ్లో ఉపాధి లేక ఎడారి దేశాలకు వలస పోయిన చాలామందికి కరోనా కారణంగా కంపెనీల్లో పనిపోయింది. జీతాల్లేక తిండి తిప్పలకే నానా కష్టాలు పడుతున్నారు. ఇండియాకు తిరిగివచ్చేందుకు అప్పుసప్పు చేసి ఫ్లయిట్ టికెట్‍ కొంటున్నారు. అలాంటివారికి వీలైతే సాయం చేయాల్సిన రాష్ట్ర సర్కారు, కొత్త కొత్త కండీషన్లతో వారిని ఇబ్బందిపెడుతోంది. క్వారంటైన్ చార్జీల పేరుతో ఒక్కో ప్రయాణికుడి నుంచి రూ. 8 వేల చొప్పున వసూలు చేస్తోంది. ఓ పక్క గల్ఫ్ నుంచి వచ్చే కార్మికులకు ఎలాంటి క్వారంటైన్ చార్జీలు వసూలు చేయడం లేదని రాష్ట్ర మంత్రి ప్రశాంత్ రెడ్డి చెబుతుంటే, మరో పక్క రూ. 8 వేల క్వారంటైన్ చార్జీలు చెల్లించనిదే ఫ్లయిట్ టికెట్ ఇచ్చేది లేదని టీఎస్‍టీడీసీ అంటోంది. క్వారంటైన్ చార్జీల విషయంలో సర్కారు రెండు నాల్కల ధోరణిపై గల్ఫ్ కార్మికులు మండిపడుతున్నారు.

గవర్నమెంట్ క్వారంటైన్ యేడబాయె..

రాష్ట్రానికి వస్తున్న గల్ఫ్ కార్మికుల నుంచి ప్రభుత్వం క్వారంటైన్‍ ఫీజులు వసూలు చేస్తుందనే విమర్శలు, ప్రతి పక్షాలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని, వీటిని ఎవరూ నమ్మవద్దని మార్చి 23 న నిజామాబాద్ లోని ప్రగతి భవన్‍లో మంత్రి ప్రశాంత్‍రెడ్డి చెప్పారు. ఇదంతా రాజకీయంగా గిట్టని వారు చేస్తున్న దుష్ప్రచారంగా కొట్టేశారు. క్వారంటైన్‍ కోసం గల్ఫ్ నుంచి వచ్చే ఏ ఒక్కరి నుంచి నయా పైసా వసూలు చేస్తలేమనీ, చేయబోమని మీడియా సాక్షిగా ఆ రోజు ప్రామీస్ చేశారు. గల్ఫ్ నుంచి వచ్చేవారిని హైదరాబాద్ ఏయిర్ పోర్టు నుంచే ఆఫీసర్లు క్వారంటైన్కు తరలిస్తున్నారు. డబ్బులు చెల్లించే స్థోమత ఉన్న వారు ప్రైవేటు హోటల్స్ లో క్వారంటైన్ అయితే, డబ్బులు చెల్లించే స్థితిలో లేనివారిని మొదట్లో గవర్నమెంట్ క్వారంటైన్ కు పంపించారు. తిండితిప్పలను కూడా ఆఫీసర్లే చూసుకున్నారు. మంత్రి కూడా ఇదే చెప్పారు. కానీ రోజులు గడిచే కొద్దీ గల్ఫ్ కార్మికులపై కేర్ తగ్గింది. గవర్నమెంట్ క్వారంటైన్కు బదులు అందరినీ హోటల్లో క్వారంటైన్ చేస్తున్నట్లు తెలిసింది.

తిండికీ తిప్పలు..

ఉద్యోగాలు, ఉపాధి కోసం సౌదీ అరేబియా, యుఏఈ, కువైట్, ఓమన్, ఖతార్, బహ్రెయిన్ తదితర దేశాల్లో సుమారు 8 లక్షల మంది తెలంగాణవాసులు ఉంటున్నారు. అనధికారికంగా ఇంకో 2లక్షల మంది వరకు ఉంటారని ప్రవాసీ మిత్ర లేబర్ యూనియన్, ఎమిగ్రెంట్స్ వెల్ఫేర్ ఫోరమ్ తదితర సంస్థలు చెబుతున్నారు. వీరిలో ఎక్కువ మంది ఉపాధి కోసం తెలంగాణలోని నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, కరీంనగర్‍, వరంగల్, మెదక్‍, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల నుంచే ఉన్నారు. లాక్డౌన్ ఎఫెక్ట్ తో వరల్డ్ వైడ్ చమురుధరలు పతనం కావడం, కంపెనీలు, ఆఫీసులు, హోటళ్లు మూతపడడంతో వీరిలో వేలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. విజిట్ వీసాలపై వెళ్లి అక్రమంగా ఉంటున్నవారు, కంపెనీలు మారి కల్లివెల్లి అయినవారి పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. ఎవరైనా దయతలచి పెడితే తింటూ, లేదంటే పస్తులుంటున్నారు. తాజాగా వివిధ దేశాల్లో చిక్కుకున్న మనవాళ్లను ఇండియాకు రప్పించ్చేందుకు ప్రభుత్వం వందేభారత్ మిషన్ కింద ఇండియాకు వచ్చేందుకు టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. ఇండియా రావడానికి అప్పుసప్పు చేసి, టికెట్లు కొన్నామని, ఇప్పుడు క్వారంటైన్ చార్జీల పేరుతో రూ. 8 వేలు ఎక్కడికేళ్లి తెచ్చేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ హోటళ్లలోఉండబోమని, పాజిటివ్ వచ్చినవారందరినీ హోం ఐసోలేషన్ చేస్తున్నట్లే తమకూ హోంక్వారంటైన్కు అనుమతించాలని చెబుతున్నారు.

దుబాయ్లో కార్మికుల ఆందోళన

గల్ఫ్ దేశాల నుంచి హైదరాబాద్ కు చేరుకున్న కార్మికులందరికీ ఉచిత క్వారంటైన్ సౌకర్యం కల్పించాలని గల్ఫ్ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు దుబాయ్ లో తెలంగాణ కార్మికులు ప్లకార్డులతో నిరసన తెలిపారు. గల్ఫ్ నుంచి హైదరాబాద్ కు తగినన్ని విమానాలు నడపడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలని జేఏసీ కన్వీనర్ గుగ్గిల్ల రవిగౌడ్ కోరారు. ధ్యావనపల్లి లింగమూర్తి, ఒల్లల శేఖర్, చిలువేరి రమేష్, గండి రాజేష్, రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

For More News..

సార్..  మా సంగతేంది? స్టూడెంట్స్ ఆందోళన

రోజూ 24 కి.మి. సైకిల్‌‌పై బడికి.. టెన్త్‌‌లో టాప్‌‌ సాధించిన రైతు బిడ్డ

పట్నం కొలువు పాయె.. ఊర్ల పనులే ఆసరాయె..

కరోనా ఎఫెక్ట్: స్కూల్ సిలబస్ లో 30% తగ్గింపు