గోల్డెన్‌‌ ఫిష్​తో కోటీశ్వరులయ్యారు.. మత్స్యకారులను వరించిన అదృష్టం

గోల్డెన్‌‌ ఫిష్​తో కోటీశ్వరులయ్యారు.. మత్స్యకారులను వరించిన అదృష్టం
  • రూ.7 కోట్లకు అమ్ముడుపోయిన చేపలు

కరాచీ: అదృష్టం ఎప్పుడు ఎవరిని ఏ రూపంలో వరిస్తుందో తెలియదు.. అలాంటి అదృష్టమే ఇప్పుడు ఒక ఫిషర్‌‌‌‌మ్యాన్‌‌కు చేప రూపంలో వరించింది. దీంతో ఏకంగా ఆ వ్యక్తి రాత్రికిరాత్రే కోటీశ్వరుడు అయ్యాడు. ఆ అదృష్టవంతుడు పాకిస్తాన్‌‌లోని కరాచీలో ఉన్నాడు. ఇబ్రహీం హైదరీ గ్రామానికి చెందిన హాజీ బలోచ్‌‌.. అతని అనుచరులతో కలిసి సోమవారం అరేబియా సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్లాడు. వారి వలలో అరుదైన ‘గోల్డెన్‌‌ ఫిష్‌‌ (సోవా)’అనే చేపలు పడ్డాయి. ఈ చేపలను శుక్రవారం వేలానికి పెట్టగా ఏకంగారూ.7 కోట్లకు (70 మిలియన్లు) అమ్ముడుపోయాయి. దీంతో హాజీ, అతని అనుచరుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఒక్కో చేప ధర దాదాపు రూ.70 లక్షలు పలికింది. సోవా చేపలు చాలా అమూల్యమైనవి.. అరుదైనవి.

వీటిలో అనేక మెడికల్‌‌ వ్యాల్యూస్‌‌ ఉంటాయి. దాని పొట్ట నుంచి వచ్చే పదార్థాల్లో ఔషధ గుణాలు కలిగి ఉండి, మెడికల్‌‌ ట్రీట్‌‌మెంట్‌‌లో వినియోగిస్తారు. ఆ చేపల నుంచి వచ్చే దారం లాంటి పదార్థాన్ని సర్జరీలలో ఉపయోగిస్తారు. అలాగే, సోవా చేపలు సాంస్కృతిక, సంప్రదాయ ప్రాముఖ్యతను కూడా కలిగి ఉన్నాయి. సంప్రదాయ ఔషధాలతో పాటు స్థానిక వంటకాల్లో కూడా ఈ చేపను వండుతారు. ఈ చేపలు 1.5 మీటర్ల పొడవు, 20 నుంచి 40 కేజీల బరువు ఉంటాయి. వేలంలో డబ్బును తాను, తన అనుచరులు సమానంగా పంచుకుంటామని హాజీ బలోచ్‌‌ చెప్పాడు. కాగా, ఎక్కువగా సముద్రం లోపలే ఉండే ఈ చేపలు గుడ్లు పెట్టడానికి మాత్రమే తీరానికి వస్తాయి.