ట్రంప్ శాంతి దూత.. ఇండియా, పాక్ యుద్ధం ఆపి..పెను విపత్తు తప్పించారు: షరీఫ్

ట్రంప్ శాంతి దూత.. ఇండియా, పాక్ యుద్ధం ఆపి..పెను విపత్తు తప్పించారు: షరీఫ్

ఇస్లామాబాద్/న్యూయార్క్: అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‎కు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా వంత పాడారు. ‘‘ట్రంప్ ఒక శాంతి దూత. ఇండియా, పాక్ యుద్ధాన్ని ఆపడం ద్వారా దక్షిణాసియాలో పెను విపత్తును ఆయన తప్పించారు” అని కొనియాడారు. ఐక్యరాజ్యసమితి సమావేశాల నేపథ్యంలో అమెరికాలో ఉన్న షెహబాజ్ షరీఫ్.. గురువారం వైట్​హౌస్‏లో ట్రంప్‎తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పాక్ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్​ కూడా పాల్గొన్నారు. అనంతరం పాక్ ప్రధాన మంత్రి ఆఫీస్ (పీఎంవో) ఒక ప్రకటన విడుదల చేసింది. 

‘‘ట్రంప్ అనేక దేశాల మధ్య సంఘర్షణలను ఆపేందుకు సిన్సియర్‎గా ప్రయత్నిస్తున్నారని ఈ సందర్భంగా షెహబాజ్ కొనియాడారు. ట్రంప్ తన నాయకత్వ పటిమతో పాక్, ఇండియా మధ్య కాల్పుల విరమణ జరిగేట్లు చూశారు” అని పాక్ పీఎంవో పేర్కొంది. ‘‘పాక్‎తో టారిఫ్​డీల్ కుదుర్చుకోవడంపై ట్రంప్‎కు షెహబాజ్ ధన్యవాదాలు తెలిపారు. పాకిస్తాన్‎లో అగ్రికల్చర్, ఐటీ, మైన్స్, ఎనర్జీ సెక్టార్లలో పెట్టుబడులు పెట్టేందుకు అమెరికన్ కంపెనీలు ముందుకు రావాలని కోరారు. 

టెర్రరిజంపై పాక్ పోరాటాన్ని ట్రంప్ బహిరంగంగా ధ్రువీకరించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. సెక్యూరిటీ, ఇంటెలిజెన్స్ విషయంలో సహకారం అందించాలని కోరారు. పాక్ పర్యటనకు రావాలని ట్రంప్‎ను ఆహ్వానించారు” అని పాక్  పీఎంవో వివరించింది. 

కాగా, ఏప్రిల్ 22న పహల్గాం టెర్రర్ అటాక్ తర్వాత పాక్‎లోని టెర్రర్ స్థావరాలపై ఆపరేషన్ సిందూర్ పేరుతో ఇండియా మిసైల్ దాడులు చేసింది. పాక్ కాళ్లబేరానికి రావడంతో కాల్పుల విరమణకు అంగీకరించింది. అయితే, పాక్, ఇండియా మధ్య కాల్పుల విరమణకు తానే ఒప్పించానంటూ ట్రంప్ పదే పదే చెప్పుకుంటున్నారు. తాజాగా షెహబాజ్ కూడా ఆయనకు మరోసారి వంతపాడారు.