పాక్ షెల్ దాడులు: నరకం చూస్తున్న సరిహద్దు గ్రామాలు

పాక్ షెల్ దాడులు: నరకం చూస్తున్న సరిహద్దు గ్రామాలు

పాక్ షెల్ దాడులు

జమ్ము: ఐఏఎఫ్ వింగ్ కమాండర్ అభినందన్ పాక్ నుంచి క్షేమంగా తిరిగి వచ్చేశారు. భారత్ – పాక్ మధ్య ఉద్రిక్తతలను చల్లార్చడానే ఆయన్ని విడిచి పెడుతున్నామని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటన.. శాంతి కోసమే తమ ప్రయత్నమని వెల్లడి.. ఈ పరిణామాలన్నీ చూసిన కశ్మీర్ సరిహద్దుల్లోని గ్రామాల ప్రజలు ప్రశాంతంగా జీవితం సాగించొచ్చని ఆశ పడ్డారు. కానీ పాకిస్థాన్ ది పక్కా కుటిల నీతి అని తెలుసుకోవడానికి పెద్దగా టైం పట్టలేదు. ఉద్రిక్తతలు తగ్గకపోగా మరింత పెరిగాయి. పాక్ శాంతి మాటలన్నీ పచ్చి అబద్ధాలని తేలిపోయింది. ప్రపంచం ముందు షో కోసమే ఆ ప్రకటనలని అర్థమైంది. భారత్ తో నిత్యం హోరాహోరీ ఉండాలన్నదే దాయాది దేశం అభిమతం అని సరిహద్దుల్లో పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి.

నిత్యం మోర్టార్ షెల్ దాడులతో పాక్ సేనలు విరుచుపడుతున్నాయి. ఆ దాడులను తిప్పికొట్టేందుకు భారత ఆర్మీ పోరాడుతూనే ఉంది. ఈ హోరాహోరీలో జమ్ము కశ్మీర్ లోని సరిహద్దు గ్రామాల ప్రజలు అల్లాడిపోతున్నారు. వారి ఇళ్లు ధ్వంసం అయిపోతున్నాయి. షెల్స్ తగిలి పశువులు చనిపోతున్నాయి. రోజు వారీ పనులు చేసుకోలేని పరిస్థితి. పొట్టకూటి కోసం పనులకు కదల్లేరు. పిల్లలు స్కూల్ కు వెళ్లలేరు. పరీక్షలు కూడా రద్దు. చివరికి ప్రాణాలను అరచేతిలో పట్టుకుని.. బిక్కుబిక్కుమని బతకాల్సిన స్థితి.

పాక్ దాడుల్ని తిప్పికొడుతున్న భారత ఆర్మీ జవాన్లు

నిత్యం అతలాకుతలం

ఆర్ఎస్ పొరా, నౌషెరా, పూంచ్ సెక్టార్లలోని అనేక గ్రామాలు.. అభినందన్ తిరిగి వచ్చిన మరుసటి రోజు నుంచే నిత్యం పాక్ షెల్ దాడులతో అతలాకుతలమవుతున్నాయి. మోర్టార్ షెల్ దాడులతో ఇంటి గోడలకు కన్నాలు పడుతున్నాయని సుచేతగఢ్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి చెప్పాడు. తమ దుస్తుల దగ్గర నుంచి పశువుల శరీరాల వరకు అన్నీ తుట్లు పడిపోతున్నాయన్నాడు. నిన్న ఒక్క రోజే నాలుగు పశువులు చనిపోయాయని తెలిపాడు. జనాలకు తీవ్ర గాయాలవుతున్నాయని, ప్రభుత్వం దగ్గర నుంచి తమకు కనీసం సాయం కూడా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు.

ఎన్నాళ్లీ బతుకు.. పాక్ కు తగిన బుద్ధి చెప్పండి

‘మేము రోజూ నరకం చూస్తున్నాం. ఇంకా ఎన్నాళ్లు ఈ దాడులను భరిస్తూ బతకాలి. మా జీవితాలను ఇంత దారుణంగా తయారు చేసిన పాకిస్థాన్ కి తగిన బుద్ధి చెప్పండి. ఆర్మీ, ప్రధాని మోడీ వెనకే మేమంతా ఉంటాం’ అని కిషన్ లాల్ అనే వ్యక్తి చెప్పాడు.

ఆర్మీ అలారం ఇస్తే బంకర్లలోకి వెళ్తాం

‘రోజూ బిక్కుబిక్కుమని బతుకుతున్నాం. పాక్ షెల్స్ ప్రయోగించినప్పుడు ఆర్మీ పోస్టుల నుంచి అలారం మోగుతుంది. వెంటనే బంకర్లోకి వెళ్లి దాక్కుంటాం. కొన్ని సార్లు వెళ్లలేక బయటే ఉండిపోతాం. ఆ సమయంలో జనాలకు తీవ్ర గాయాలవుతున్నాయి. ఇది ఇక్కడ నిత్యం ఉండే సమస్య’ అని నౌషెరా ప్రాంతానికి చెందిన సవితా దేవి అనే మహిళ చెప్పింది. ప్రభుత్వం సాయం అందిస్తున్నా అది చాలా తక్కువగా ఉందని చెప్పిందామె.

పిల్లల చదువులెలా

రఫీక్

‘పాక్ షెల్స్ దాడుల వల్ల కొన్ని రోజులుగా స్కూళ్లు మూసేశారు. కొన్ని పరీక్షలను కూడా రద్దు చేశారు. పాక్ షెల్ ఫైరింగ్ మాత్రం ఆపట్లేదు. మేం ఏం చేయాలి. మా పిల్లలకు ఇంట్లోనే చదువు చెప్పుకుందామంటే మేం అంతగా చదువుకోలేదు’ అని ఆవేదన వ్యక్తం చేశాడు పూంచ్ ప్రాంతానికి చెందిన మహమ్మద్ రఫీక్.

బాధితులకు ప్రభుత్వ సాయం

పాక్ షెల్స్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులకు ప్రభుత్వం సాయం అందిస్తోందని రాజౌరీ అధికారి అసద్ తెలిపారు. ఎవరైనా ప్రాణాలు కోల్పోతే వారి కుటుంబానికి కేంద్రం రూ.5 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్ష పరిహారం అందిస్తున్నాయన్నారు. అలాగే బాధిత కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, అర్హులు లేకపోతే రూ.4 లక్షల డబ్బు ఇస్తున్నట్లు చెప్పారు. గాయాలైన వారికి వాటి తీవ్రతను బట్టి ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు.