బరితెగించిన పాక్.. జనవాసాలపై డ్రోన్లతో దాడి.. పలువురికి గాయాలు

బరితెగించిన పాక్.. జనవాసాలపై డ్రోన్లతో దాడి.. పలువురికి గాయాలు

న్యూఢిల్లీ: ఉద్రిక్తల వేళ పాక్ బరితెగించింది. ఇప్పటి వరకు భారత సైనిక స్థావరాలు, ఎయిర్ పోర్టులు, ప్రార్ధన మందిరాలు టార్గెట్‎గా డ్రోన్, మిసైల్ దాడులకు ప్రయత్నించిన పాక్.. తాజాగా జనవాసాలపై దాడులకు తెగబడింది. శుక్రవారం (మే 9)  రాత్రి భారత్‎లోని పలు ప్రాంతాల్లో డ్రోన్లతో దాడులకు దిగింది. సరిహద్దు రాష్ట్రాలైన జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్‎లోని పలు ప్రాంతాల్లో డ్రోన్లతో ఎటాక్ చేసింది. 

ఈ క్రమంలోనే పంజాబ్‎లోని ఫిరోజ్‎పూర్‎లో పాక్ జనవాసాలపై డ్రోన్ దాడి చేసింది. ఈ దాడిలో ఓ కుటుంబం గాయాలపాలైంది. వెంటనే అప్రమత్తమైన అధికారులు.. డ్రోన్ దాడిలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. డ్రోన్ ఎటాక్ నేపథ్యంలో అలర్ట్ అయిన భారత సైన్యం.. ఫిరోజ్ పూర్ లో పూర్తిగా బ్లాక్ అవుట్ ప్రకటించింది. నగరం మొత్తం విద్యుత్ సరఫరా నిలిపివేసింది. ప్రజలు ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ఆదేశించింది.  

సాంబా సెక్టర్, పోఖ్రాన్, ఫిరోజ్‎పూర్‎, పంజాబ్‎లోని పఠాన్ కోట్‎, యూరీ, కుప్వారా, పూంఛ్, నౌగౌమ్, సాంబా, తంగదార్ సెక్టర్లలో కూడా పాక్ డ్రోన్ దాడులకు ప్రయత్నించింది. రెప్పపాటులో అలర్టైన భారత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పాక్ డ్రోన్లను గాల్లోనే పేల్చేశాయి. పాక్ దాడుల నేపథ్యంలో సరిహద్దులోని పలు ప్రాంతాల్లో వార్ సైరన్ మోగింది. జమ్మూ, అక్నూర్, పఠాన్ కోట్, జైసల్మేర్, ఫిరోజ్‎పూర్, అమృత్ సర్, అంబాలా, పంచకులాతో పాటు పలు సరిహద్దు ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్తలో భాగంగా పూర్తిగా బ్లాక్ అవుట్ ప్రకటించారు. 

మరోవైపు పాక్ దాడులకు భారత సైన్యం ధీటుగా బదులిస్తోంది. పాక్ కాల్పులను తిప్పికొడుతూనే.. మరోవైపు పాక్ డ్రోన్లను ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‎తో ఎక్కడికక్కడ నేలమట్టం చేస్తోంది. అయితే.. పాక్ బరితెగించి జనవాసాలపై దాడులకు పాల్పుడుతుండటంతో ఆగ్రహానికి గురైన భారత్.. కౌంటర్ ఎటాక్ కు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ ను చావు దెబ్బ కొట్టేందుకు త్రివిధ దళాలు రెడీ అవుతోన్నట్లు సమాచారం. ఈ పరిణామాల నడుమ.. ఏం క్షణాన ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ నెలకొంది.