పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితిపై ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉందని, ఇతర దేశాలకు వెళ్లి అప్పు అడిగే సమయంలో సిగ్గు అనిపించిందన్నారు. వాళ్లు పెట్టే షరతులకు తలవంచాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితిపై ఆ దేశ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్నదని ఒప్పుకున్న ఆయన.. పరిస్థితిని చక్కదిద్దేందుకు తమ మిత్ర దేశాల వద్ద అప్పు తెచ్చామని చెప్పారు. అయితే, అలా అప్పు అడిగేటప్పుడు తనకు చాలా సిగ్గుగా అనిపించిందన్నారు. అప్పు కోసం వెళ్లినప్పుడు వారు పెట్టే షరతులకు తలవంచాల్సి వస్తుందని తెలిపారు.
శుక్రవారం రాత్రి షరీఫ్ ఇస్లామాబాద్‌లో ఎక్స్‌పోర్టర్లు, వ్యాపారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.." నేను, ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ (ప్రస్తుత సీడీఎఫ్) అసిమ్ మునీర్ తో కలిసి అప్పు కోసం మన మిత్ర దేశాల వద్దకు వెళ్లాం. అలా అందరి దగ్గర డబ్బులు అడుగుతుంటే మాకు చాలా సిగ్గుగా అనిపించింది. అప్పు అడిగేటప్పుడు తల వంచుకోవాల్సి వస్తుంది. అప్పు ఇచ్చేవారు ఏ డిమాండ్ చేసినా అడ్డు చెప్పలేకపోతాం.
చాలా సందర్భాల్లో స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోలేం. రుణాలు తీసుకోవడం ఆత్మగౌరవానికి పెద్ద దెబ్బ. దేశ విదేశీ మారక నిధులు దాదాపు రెట్టింపు అయినప్పటికీ.. అందులో మిత్ర దేశాల నుంచి తీసుకున్న రుణాలే ఎక్కువున్నాయి" అని వివరించారు. అయితే, తాము అడిగిన వెంటనే చాలా దేశాలు రుణాలు ఇచ్చాయని షరీఫ్ తెలిపారు. పాక్‌కు ఆర్థిక మద్దతిచ్చిన సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, చైనా వంటి మిత్ర దేశాలన్నింటికీ ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. పాకిస్తాన్ లో నిరుద్యోగం, పేదరికం పెరిగిపోవడంపై షరీఫ్ ఆందోళన వ్యక్తం చేశారు. తమకు ఆర్థికసాయం అందించిన దేశాల్లో చైనా మొదటి స్థానంలో ఉందని ఆయన పేర్కొన్నారు.
