భారత జాతీయ గీతాన్ని ప్లే చేసిన పాకిస్థానీ కళాకారుడు

భారత జాతీయ గీతాన్ని ప్లే చేసిన పాకిస్థానీ కళాకారుడు

ఢిల్లీ నుంచి గల్లీ వరకు 75వ స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా భారతీయులకు ఇతర దేశాల ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అందులో భాగంగా  దాయాది దేశమైన పాకిస్థాన్‌కు చెందిన ఓ సంగీత కళాకారుడు చాలా స్పెషల్ గా విషెస్ చెప్పాడు. సియాల్ ఖాన్  రబాబ్ వాయిద్యం మీద  భారత జాతీయ గీతమైన 'జన గణ మన' ని ప్లే చేశాడు. రబాబ్ అనేది చూడడానికి వీణను పోలి ఉంటుంది.

ఇది పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్,  కాశ్మీర్ వంటి  ప్రదేశాలలో ప్రసిద్ధ సంగీత వాయిద్యం.  సియాల్ నిర్మలమైన పర్వతాల మధ్య కూర్చొని  నిమిషం 22 సెకన్ల పాటు జాతీయ గీతాన్ని ప్లే చేశాడు. ఈ వీడియోను తన ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ  'సరిహద్దు ఆవతలి వైపు ఉన్న నా వీక్షకులకు ఇదిగో నా బహుమతి' అని క్యాప్షన్ ఇచ్చాడు. అంతేకాకుండా "భారతదేశానికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. మన మధ్య శాంతి, సహనం, స్నేహం, సద్భావనకు చిహ్నంగా నేను దేశ జాతీయ గీతాన్ని ప్లే చేశాను" అని రాసుకొచ్చాడు. ఈ వీడియో నెటిజన్లును బాగా ఆకట్టుకొవడంతో క్షణాల్లో వైరల్ గా మారింది.