ఇస్తాంబుల్: అఫ్గానిస్తాన్‌తో చర్చలు విఫలమైతే.. ఇక యుద్ధమే అని పాకిస్తాన్ రక్షణశాఖ మంత్రి ఖవాజా మహమ్మద్ ఆసిఫ్ ప్రకటించారు. అఫ్గాన్తో శాశ్వత ఒప్పందం దిశగానే తాము అడుగులు వేస్తున్నామని ఓ మీడియా ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఇస్తాంబుల్‌లో జరుగుతున్న శాంతి చర్చల నేపథ్యంలో ఖవాజా ఆసిఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
అదే సమయంలో అఫ్గానిస్తాన్ శాంతిని కోరుకుంటున్నట్లు తాను గమనించానని కూడా ఆయన పేర్కొన్నారు. కాగా, కొద్దిరోజులుగా రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్నది. దాడులు, ప్రతి దాడులతో సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆసిఫ్ చేసిన కామెంట్లు.. వైరల్ అవుతున్నాయి. ‘‘ఒకవేళ అఫ్గానిస్తాన్‌తో ఒప్పందం కుదరకపోతే, వారితో బహిరంగ యుద్ధానికి దిగే అవకాశం మాకు ఉంది.
కానీ, వారు శాంతిని కోరుకుంటున్నారని నేను చూశాను. ఈ నెల 18, 19వ తేదీల్లో ఫస్ట్ రౌండ్ పీస్ మీటింగ్ దోహాలో జరిగింది. ఖతార్, టర్కీ మీడియేటర్‌గా వ్యవహరించాయి. ఆ సమయంలో కాల్పుల విరమణ ఒప్పందానికి రెండు దేశాలు అంగీకారం తెలిపాయి. నాలుగైదు రోజులుగా సరిహద్దులు ప్రశాంతంగానే ఉన్నాయి. శనివారం నుంచి రెండో విడత చర్చలు మొదలయ్యాయి’’అని ఖవాజా తెలిపారు. అఫ్గానిస్తాన్ డిప్యూటీ ఇంటీరియర్ మినిస్టర్ రహముతుల్లా ముజీబ్,
ఇంటీరియర్ మినిస్టర్ నూర్ అహ్మద్ నూర్ తమ్ముడైన అనాస్ హక్కాని చర్చల్లో పాల్గొన్నారు. పాకిస్తాన్ నుంచి ఇద్దరు ప్రతినిధుల బృందం పీస్ మీటింగ్‌కు హాజరైంది. కాగా, సరిహద్దుల్లో శాంతి, స్థిరత్వాన్ని కొనసాగించడానికి రెండు దేశాలు కలిసి ఒక మెకానిజం రూపొందించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. అఫ్గానిస్తాన్‌లోని తమ స్థావరాల నుంచి పాకిస్తాన్‌పై దాడులు చేస్తున్న మిలిటెంట్లను అరికట్టాలని తాలిబాన్ ప్రభుత్వాన్ని పాక్ డిమాండ్ చేయడంతో సరిహద్దు ఘర్షణలు తీవ్రమయ్యాయి.
