ముంబై: టీమిండియా స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మందాన మాజీ బాయ్ ఫ్రెండ్, మ్యూజిక్ డైరెక్టర్ పలాష్ ముచ్చల్‌పై చీటింగ్ ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. రూ.40 లక్షలు తీసుకుని మోసం చేశాడంటూ పలాష్‌పై ఫిల్మ్ ఫైనాన్షియర్ విద్యాన్ మానే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో తనపై వచ్చిన చీటింగ్ ఆరోపణలపై పలాష్ ముచ్చల్ ఎట్టకేలకు స్పందించాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టాడు.
తనపై వచ్చిన చీటింగ్ ఆరోపణలు అవాస్తవమైవని.. వాటిని తీవ్రంగా ఖండిస్తున్నానని పేర్కొన్నాడు. ఇదంతా తన పరువు తీసే కుట్ర అని ఆవేదన వ్యక్తం చేశాడు. చీటింగ్ ఆరోపణలను న్యాయపరంగా ఎదుర్కొంటానని స్పష్టం చేశాడు. ‘‘సాంగ్లీకి చెందిన విద్యాన్ మానే సోషల్ మీడియాలో తనపై చేసిన చీటింగ్ ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి మరియు అవాస్తవమైనవి. నా ప్రతిష్టను దెబ్బతీసే దురుద్దేశంతో తప్పుడు ఆరోపణలు చేశారు. ఈ విషయాన్ని చట్టపరంగా ఎదుర్కొంటాం’’ అని పలాష్ పేర్కొన్నాడు.
అసలు వివాదం ఏంటంటే..?
ఒక సినిమా నిర్మాణం కోసం పలాష్ తన నుంచి రూ.40 లక్షలు తీసుకుని మోసం చేశాడని ఫిల్మ్ ఫైనాన్షియర్ విద్యాన్ మానే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు లావాదేవీలకు సంబంధించిన వివరాలను సాంగ్లీ పోలీసులకు అందజేశాడు. ‘‘నజారియా అనే సినిమా నిర్మాణంలో పెట్టుబడి పెట్టాలని పలాష్ తనకు సూచించాడు. అతడి మాటలు నమ్మి రూ.40 లక్షలు ఇన్వెస్ట్ చేశా. కానీ ఆ సినిమా ఇంకా పూర్తి కాలేదు.
Also Read : 14వ స్థానంలో ఉన్న స్కాట్లాండ్ వరల్డ్ కప్‌కు క్వాలిఫై
ఇదేంటని పలాష్‌ను నిలదీస్తే తన డబ్బులు తనకు తిరిగి ఇస్తానని చెప్పాడు. ఆ తర్వాత డబ్బుల కోసం ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు. చివరికి నా నెంబర్ బ్లాక్ చేశాడు’’ అని మానే ఫిర్యాదులో పేర్కొన్నాడు. పలాష్ ముచ్చల్‌పై చీటింగ్ ఆరోపణలపై ఫిర్యాదు అందినట్లు సాంగ్లీ పోలీసులు ధృవీకరించారు. మానే చేసిన ఆరోపణలను పరిశీలిస్తున్నామని.. ఇప్పటివరకు అయితే ఎటువంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని సాంగ్లీ పోలీసులు వెల్లడించారు.
చివరి నిమిషంలోపెళ్లి క్యాన్సిల్:
భారత మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మంధనా, మ్యూజిక్ డైరెక్టర్ పలాష్ ముచ్చల్ వివాహం చివరి నిమిషంలో రద్దైన విషయం తెలిసిందే. 2025, నవంబర్ 23న వీరి వివాహం జరగాల్సి ఉండగా.. పెళ్లికి కొన్ని గంటల ముందు స్మృతి తండ్రి అనారోగ్యానికి గురి కావడంతో పెళ్లి ఆగిపోయింది. ఏమైందో తెలియదు కానీ చివరకు ఈ పెళ్లి రద్దు అయ్యింది.
పలాష్ ముచ్చల్ ఓ లేడీ కొరియోగ్రాఫర్‌తో చేసిన చాట్ లీక్ కావడంతోనే పెళ్లి క్యాన్సిల్ అయిందని జోరుగా ప్రచారం జరిగింది. దీంతో స్మృతిని మోసం చేశాడంటూ పలాష్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో పలాష్‌పై చీటింగ్ ఆరోపణలపై పోలీసులకు ఫిర్యాదు అందటం గమనార్హం. దీంతో ఎవరైనా ఖర్మ ఫలితం అనుభవించాల్సిందేనని స్మృతి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అయితే.. పలాష్‌పై ఫిర్యాదు చేసిన వైభవ్ మానే స్మృతి ఫ్యామిలీకి దగ్గరి వ్యక్తే కావడం ఇక్కడ మరో విశేషం.
