మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతోనే రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల ఆసరా పింఛన్లు వచ్చాయని ఎల్బీనగర్ బీజేపీ కన్వీనర్, చంపాపేట కార్పొరేటర్ వంగా మధుసూదన్ రెడ్డి తెలిపారు. అంతేగాకుండా కొత్త మండలం ప్రకటించారనే విషయాన్ని గుర్తు చేశారు. మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డితో కలసి కర్మన్ ఘాట్ చౌరస్తాలో బీజేపీ శ్రేణులు రాజగోపాల్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వంగా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యేల రాజీనామా, ఉప ఎన్నికలు వస్తేనే కేసీఆర్ ప్రభుత్వం అభివృద్ధి జపం చేస్తోందని విమర్శించారు.
లేనిపక్షంలో మొద్దు నిద్రలో ఉంటుందని ఎద్దేవా చేశారు. మునుగోడు అభివృద్ధి జరగాలంటే రాజగోపాల్ రెడ్డి ని గెలిపించుకోవాలని కోరారు. ఎల్బీనగర్ లో 9 వేల ఆసరా పెన్షన్లు కూడా రాజగోపాల్ రెడ్డి వల్లే వచ్చాయన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో అభివృద్ధి జరగాలంటే వెంటనే సుధీర్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
