- ఏడుగురు థర్డ్ ఇయర్ స్టూడెంట్లపై చర్యలు
- కాలేజీ నుంచి ఆరునెలలు, హాస్టల్ నుంచిశాశత్వంగా సస్పెన్షన్
వరంగల్ సిటీ, వెలుగు : వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం చెలరేగింది. పది రోజుల కింద జరిగిన ఈ ఘటనలో ఏడుగురు స్టూడెంట్లపై సస్పెన్షన్ వేటు పడింది. వివరాల్లోకి వెళ్తే... కాకతీయ మెడికల్ కళాశాలలో సెకండ్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్ల వాట్సప్ గ్రూప్‌లో థర్డ్ ఇయర్ స్టూడెంట్ల గురించి తప్పుగా మాట్లాడుకుంటున్నారని ప్రచారం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న థర్డ్ ఇయర్ స్టూడెంట్లు మార్చి 30న 20 మంది సెకండ్ ఇయర్ స్టూడెంట్లను హాస్టల్ టెర్రస్‌పైకి పిలిపించారు.
వారందరినీ మోకాళ్లపై కూర్చోబెట్టి మరోసారి తప్పుడు ప్రచారాలు చేయబోమని సారీ చెప్పించుకోవడంతో పాటు శారీరకంగా ఇబ్బందులకు గురి చేశారు. దీంతో సెకండ్ ఇయర్ స్టూడెంట్లు ఈ నెల 4న ఆన్‌లైన్‌లో నేషనల్ మెడికల్ కౌన్సిల్, యూజీసీకి ఫిర్యాదు చేశారు. స్పందించిన ఆయా సంస్థల ఆఫీసర్లు ర్యాగింగ్‌పై విచారణ చేపట్టాలని ఈ నెల 7న కాకతీయ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ సంధ్యారాణిని ఆదేశించారు. దీంతో ఆమె యాంటీ ర్యాగింగ్ కమిటీతో కలిసి 8న సీక్రెట్‌గా విచారణ చేపట్టారు.
ర్యాగింగ్ జరిగింది నిజమేనని తేలడంతో ఏడుగురు థర్డ్ ఇయర్ స్టూడెంట్లను కాలేజీ నుంచి ఆరు నెలలు, హాస్టల్ నుంచి శాశ్వతంగా సస్పెండ్ చేస్తున్నట్లు ప్రిన్సిపాల్ ప్రకటించారు. మరో వైపు బీఎస్సీ పారామెడికల్ థర్డ్ ఇయర్ స్టూడెంట్లు సెకండ్ ఇయర్ స్టూడెంట్లను కొట్టడంతో... వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. మరోమారు ఇలా జరిగితే సస్పెండ్ చేస్తామని కేఎంసీ ప్రిన్సిపాల్ సంధయారాణి హెచ్చరించారు.
