- స్పెషల్ సెక్రటరీ శ్రీనివాసరాజు వెల్లడి
కొడంగల్, వెలుగు: వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణంలోని శ్రీ మహాలక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణం, విస్తరణ పనులను సంప్రదాయబద్ధంగా, అత్యున్నత నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని సీఎం స్పెషల్ సెక్రటరీ శ్రీనివాసరాజు అధికారులను ఆదేశించారు. కలెక్టర్ దీపక్ తివారితో కలిసి ఆలయాన్ని గురువారం ఆయన సందర్శించారు. బాలాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం సమీక్ష నిర్వహించారు. గర్భాలయం, కల్యాణ మండపం, పార్కింగ్ వంటి వివిధ అభివృద్ధి పనుల నమూనాలను పరిశీలించి పలు సూచనలు చేశారు.
ఈ నెల 25న సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్లో పర్యటించి ఈ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో ఏర్పాట్లను పక్కాగా చేయాలని ఆదేశించారు. భక్తులకు అవసరమైన క్యూలైన్లు, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని స్పష్టం చేశారు. ఇప్పటికే ఆలయ విస్తరణలో ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులకు పరిహారం అందజేయడంతోపాటు లక్కీ డిప్ ద్వారా ఇళ్ల స్థలాలను కూడా కేటాయించారు. ఈ కార్యక్రమంలో కడా ఆఫీసర్ వెంకట్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ రాజేశ్వరి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
