రోడ్ కం బ్యారేజీలతో పాలమూరు ఎడారి.. మహబూబ్ నగర్ జిల్లా ఎడారిగా మారే పరిస్థితి

రోడ్  కం బ్యారేజీలతో పాలమూరు ఎడారి.. మహబూబ్ నగర్  జిల్లా ఎడారిగా మారే పరిస్థితి
  •     మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

మహబూబ్ నగర్, వెలుగు: కృష్ణా, బీమా నదులపై కర్నాటక ప్రభుత్వం కట్టిన రోడ్  కం బ్యారేజీలతో ఉమ్మడి మహబూబ్ నగర్  జిల్లా ఎడారిగా మారే పరిస్థితి ఏర్పడిందని మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్  ఆవేదన వ్యక్తం చేశారు. వీటి నిర్మాణంతో దిగువన ఉన్న ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులకు వర్షాభావ పరిస్థితుల్లో చుక్క నీరు రాదన్నారు. ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి, మాజీ మంత్రి సి.లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర రెడ్డి, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, ఎస్.రాజేందర్ రెడ్డితో కలిసి ఆదివారం కర్నాటకలోని కృష్ణా, బీమా నదులపై నిర్మించిన రోడ్  కం బ్యారేజీలను పరిశీలించారు. 

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ భవిష్యత్తులో పాలమూరుకు అన్యాయం జరుగుతుందని తెలిపారు. పాలమూరు– రంగారెడ్డి, కోయిల్ సాగర్, బీమా, జూరాల, డిండి వరకు నీళ్లు రావన్నారు. జూరాల ఎగువన ఉన్న కర్నాటక రాష్ట్రం సాగునీటి అవసరాల కోసం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. తుంగభద్ర వద్ద సిల్ట్  భారీగా పేరుకుపోయిందని, కర్నాటక చిక్కల మర్రి వద్ద మరో ప్రాజెక్టు నిర్మాణానికి పనులు ప్రారంభించిందని చెప్పారు. 

త్వరలో మంత్రాలయం వద్ద రోడ్డు కం బ్యారేజీ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసిందన్నారు. గతంలో కర్నాటక ప్రాజెక్టుల నుంచి కృష్ణ, బీమా పనులకు రీజర్మినేట్  వాటర్  వచ్చేదని,  ఇప్పుడు వర్షాలు పడుతున్నా నీళ్లు రావడం లేదన్నారు. ప్రస్తుతం కర్నాటకలో కృష్ణ, తుంగభద్ర నదులపై ఉన్న ప్రాజెక్టులు నిండినా, రాష్ట్రంలోని ప్రాజెక్టులు ఎడారిని తలపిస్తున్నాయని తెలిపారు. ఎగువ ప్రాజెక్టు నుంచి నీటిని వదిలితేనే ఉమ్మడి జిల్లాకు న్యాయం జరుగుతుందన్నారు. జూరాల ప్రాజెక్టులో సిల్ట్  తీయకపోవడంతో నీటి సామర్థ్యం తగ్గిపోతూ వస్తుందన్నారు. తెలంగాణకు ఎగువ ప్రాజెక్టు నుంచి నీటిని  విడుదల చేయించేలా సీఎం కర్నాటక ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. అన్ని రాష్ట్రాలు కలిసి పాలమూరును మోసం చేసే కుట్ర చేస్తున్నాయని విమర్శించారు.