దక్షిణ తెలంగాణ మెడికల్ హబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గా పాలమూరు

దక్షిణ తెలంగాణ మెడికల్ హబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గా పాలమూరు
  •     చివరి దశలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనులు
  •     ఏ, బీ, సీ, డీ బ్లాకులు పూర్తి
  •     జూన్ చివరిలోగా సేవలు ప్రారంభం

మహబూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్, వెలుగు: మహబూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్ జిల్లాలో విద్యాభివృద్ధి కోసం ట్రిపుల్ ఐటీ బ్రాంచ్, పాలమూరు యూనివర్సిటీలో లా, ఇంజనీరింగ్ కాలేజీలను అందుబాటులోకి తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం...  ఇప్పుడు జిల్లాలో పేదలకు మెరుగైన వైద్యం అందించడంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా చివరి దశలో ఉన్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను త్వరలో అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అన్ని రకాల వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చి దక్షిణ తెలంగాణకు మెడికల్ హబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతోంది.

85 శాతం పనులు పూర్తి

మహబూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్ నగరంలోని కొత్త బస్టాండ్ ఎదుట ఉన్న పాత కలెక్టరేట్ భవనాన్ని 2022లో కూల్చివేశారు. దాదాపు పది ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ భవనం పాతది కావడంతో కొత్త కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నిర్మించి అక్కడి నుంచే పరిపాలన ప్రారంభించారు. ఖాళీ అయిన ఈ స్థలాన్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి కేటాయించారు. గత ప్రభుత్వ హయాంలో పనులు ప్రారంభమైనప్పటికీ ఎన్నికలు తదితర కారణాలతో పనులు నిలిచిపోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పనులను వేగంగా పూర్తి చేస్తున్నారు. 

ప్రతి మూడు నెలలకోసారి ఈ హాస్పిటల్ నిర్మాణ పనులపై సంబంధిత శాఖ మంత్రి హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉమ్మడి జిల్లా మంత్రులు, ప్రభుత్వ విప్, పాలమూరు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, శాఖాధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇటీవల ఉమ్మడి జిల్లా ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి మంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా నిర్మాణ పనులను పరిశీలించి పెండింగ్ పనులపై ఆరా తీశారు. పెండింగ్ పనులు పూర్తి చేయడానికి కూడా నిధులు కేటాయించడంతో దాదాపు 85 శాతం పనులు పూర్తయ్యాయి. 

ఏ, బీ, సీ, డీ బ్లాకులు సిద్ధం

పది ఎకరాల విస్తీర్ణంలో వెయ్యి పడకలతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నిర్మిస్తున్నారు. విశాలమైన ఆవరణతో పాటు హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వచ్చే వారి వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక స్థలం కేటాయించారు. ఈ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఐదు బ్లాకులతో నిర్మిస్తున్నారు. ఇందులో ఏ, ఈ బ్లాకులు ఐదు అంతస్తులుగా ఉండగా, బీ, సీ, డీ బ్లాకులు ఆరు అంతస్తులుగా నిర్మించారు. ఐదు బ్లాకులలోని బెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు ఆక్సిజన్ సరఫరా కోసం ప్రత్యేకంగా ఆక్సిజన్ ప్లాంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేశారు. ఈ ప్లాంట్ పనులు కూడా పూర్తయ్యాయి. ప్రస్తుతం ఏ, బీ, సీ, డీ బ్లాకుల నిర్మాణం పూర్తయింది. 

జూన్ నెలలో ఈ నాలుగు బ్లాకులను ప్రారంభించి ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందించనున్నారు. ఈ-బ్లాక్ నిర్మించాల్సిన స్థలంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల (ఈవీఎం) గోదాం ఉండడంతో అనుమతులు రావడానికి ఆలస్యమైంది. గత జనవరిలో ఈవీఎం గోదామును ఉన్నతాధికారులు హ్యాండోవర్ చేయడంతో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ-బ్లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఐదు అంతస్తులతో నిర్మించాల్సి ఉండగా ప్రస్తుతం మూడు అంతస్తుల వరకు పనులు పూర్తయ్యాయి. మరో నాలుగు నెలల్లో మిగతా రెండు అంతస్తుల పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. 

సమీక్ష తర్వాత ప్రారంభ తేదీ

సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనులు దాదాపు పూర్తయ్యాయి. ఏ, బీ, సీ, డీ బ్లాకులు సిద్ధంగా ఉన్నందున మొదట ఈ నాలుగు బ్లాకులను ప్రారంభించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించనున్నాం. ఈ నెల 15 తర్వాత జిల్లా ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి మంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. ఆ సమీక్షలోనే హాస్పిటల్ ప్రారంభ తేదీని ప్రకటిస్తాం.
- యెన్నం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే, పాలమూరు