అధికార పార్టీలో  రచ్చ..రచ్చ!

V6 Velugu Posted on Jul 27, 2021

  • సొంత పార్టీ నేతలే టార్గెట్ 
  • తుమ్మల వర్గానికి అన్నీ అవమానాలే.. 
  • ఎమ్మెల్యే చెబితే కేసులు పెడుతున్రు..
  •  పోలీసుల తీరుపైనా విమర్శలు 

ఖమ్మం, వెలుగు: టీఆర్ఎస్​ పార్టీలో పాలేరు నియోజకవర్గ వర్గ పోరు పీక్​స్టేజీ కి చేరింది. సొంత పార్టీ వారిపై అధికార పార్టీ నేతలే కేసులు పెట్టడం వివాదాస్పదంగా మారుతోంది. పార్టీలో రెండు వర్గాల వారు పరస్పరం కేసులు పెట్టుకుంటే  పోలీసులు ఒక వర్గానికి చెందిన వారికి వంతపాడుతున్నారని, మరో వర్గం ఇచ్చిన  కంప్లైంట్స్ ను పక్కన పడేసి కాంప్రమైజ్​కావాలంటూ ఒత్తిడి  తెస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి రాజకీయంగా తమను టార్గెట్ చేసి, పోలీసులతో కేసులు పెట్టించి వేధిస్తున్నారని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వర్గానికి చెందిన లీడర్లు ఆరోపిస్తున్నారు. పోలీసులు ఎమ్మెల్యే చెప్పిన విధంగా నడుచుకుంటూ, ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ విమర్శిస్తున్నారు. 


గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత పాలేరులో కాంగ్రెస్​ నుంచి గెలిచిన కందాల టీఆర్ఎస్​లో చేరడంతో టీఆర్​ఎస్​  పార్టీలో వర్గ పోరు షురూ అయ్యింది. అప్పటి వరకు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వర్గీయులు పార్టీ మండల ప్రెసిడెంట్లు, రైతు బంధు సమితి ప్రెసిడెంట్లుగా ఉండగా, మెల్లగా ఎమ్మెల్యే తన వర్గీయులకు ఆ పదవులను అప్పగించారు. ఇక ఇప్పటికీ తుమ్మల వర్గీయులుగా ముద్రపడి మాజీ మంత్రి వెంట తిరుగుతున్న వారిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు బుక్​చేయడం, చిన్న అంశాల్లో కూడా పోలీస్​ స్టేషన్లకు పిలిపించి బెదిరించడం వెనుక ఎమ్మెల్యే కందాల ఉపేందర్​ రెడ్డి ఒత్తిడి ఉందని తుమ్మల వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఖమ్మం రూరల్​ మండలంలో ఆరెంపుల మాజీ సర్పంచ్​ బండి జగదీశ్, నేలకొండపల్లి మండలంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్​ శాకమూరి రమేశ్​ల మీద ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు బుక్ కావడం వెనుక ఎమ్మెల్యే  హస్తముందని తుమ్మల వర్గీయులు ఆరోపిస్తున్నారు. రూరల్​ మండలంలో ఖమ్మం మాజీ కార్పొరేటర్​ రాములు నాయక్​ మీద కేసుల వెనుక కూడా కందాల ఒత్తిడి ఉందని ఆరోపిస్తున్నారు. కూసుమంచి మండలానికి చెందిన జొన్నలగడ్డ రవి మీద ముదిగొండ మండలంలో కేసు బుక్​ చేయించేందుకు కూడా ఎమ్మెల్యే ప్రయత్నించారని చెబుతున్నారు. ఇవి కాకుండా గ్రామాల్లో జరిగే చిన్న గొడవలకు కూడా తుమ్మల వర్గీ యులను ఎమ్మెల్యే టార్గెట్ చేస్తూ, తన వర్గంలోకి రావాలంటూ ఒత్తిడి తెస్తున్నారని ఆరోపిస్తున్నారు. 


ఇటీవల తిరుమలాయపాలెం మండలం సుబ్లేడ్​ చెరువులో కొందరు మత్స్యకారులు దొంగతనంగా చేపలు పట్టారంటూ మరోవర్గం వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు దారులకు తుమ్మ ల వర్గానికి చెందిన రామ సహాయం నరేశ్ రెడ్డి సపోర్ట్ చేస్తుండగా, ఆ ఫిర్యాదుపై పోలీసులు కం ప్లైంట్ తీసుకోకపోవడం వెనుక ఎమ్మెల్యే ఒత్తిడి ​ఉందని తుమ్మల వర్గీయులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వానికి ఆదాయానికి గండి వచ్చేలా దొంగతనానికి పాల్పడిన వారిపై కూడా కేసులు కాకుండా ఎమ్మెల్యే ఒత్తిడి చేస్తున్నారని అంటున్నారు.  
 తాజా గొడవకు కారణం..
గతంలో ఎన్నో సార్లు రెండు వర్గాలకు చెందిన లీడర్లు మీడియా సమావేశాలు పెట్టి మరీ ఒకరిపై ఒకరు పలు రకాల విమర్శలు, ఆరోపణలు చేసుకున్నారు. ఆ తర్వాత కూడా పలు సందర్భాల్లో వర్గ పోరు బయటపడింది. తాజాగా కూసుమంచి మండల కేంద్రంలో ఇటీవల కేటీఆర్​ బర్త్ డే సందర్భంగా ఎమ్మెల్యే కందాల వర్గీయులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో స్థానిక ఎంపీటీసీ మాదాసు ఉపేందర్​  ఫొటోను  కూడా ముద్రించారు. తుమ్మల వర్గానికి చెందిన ఉపేందర్​ఈ ఫ్లెక్సీని చూసి, అనుమతి లేకుండా తన ఫోటోను ఫ్లెక్సీలో వాడడం, ప్రొటోకాల్ పాటించకుండా కింద చిన్నగా ఫోటో ప్రింట్ చేయడంపై సీరియస్​ అయ్యారు. ఫ్లెక్సీలో తన ఫోటో వరకు తొలగించాలని చెప్పగా, ఆయన బంధువు ఒకరు ఫ్లెక్సీలో ఉపేందర్ ఫోటో వరకు కట్ చేశారు. దీనిపై కందాల వర్గీయులు ఇచ్చిన ఫిర్యాదుతో ఉపేందర్​ బంధువుపై కేసు నమోదైంది. దీంతో తన అనుమతి లేకుండా ఫోటోను ఫ్లెక్సీలో ప్రింట్ చేయడం, ప్రోటోకాల్ పాటించకపోవడం, అనుమతి లేకుండా ఫ్లెక్సీ ఏర్పాటు మీద ఉపేందర్​ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కంప్లైంట్ ను కేసు చేయకుండా, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ సోమవారం కూసుమంచి పోలీస్​ స్టేషన్​ దగ్గర తుమ్మల వర్గీయులు ఆందోళన చేశారు. 
ఎమ్మెల్యే కందాల కక్షసాధిస్తున్నరు 
తుమ్మల వర్గానికి చెందిన నేతలను ఎమ్మెల్యే  ఉపేందర్​రెడ్డి టార్గెట్ చేశారు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్​ కోసం పనిచేసిన వారిని వేధిస్తున్నారు. తన వర్గంలోకి రావాలంటూ ఎన్నిసార్లు కందాల ఒత్తిడి చేసినా స్పందించని వాళ్ల మీద పోలీసులతో కేసులు పెట్టిస్తున్నారు. దీన్ని పార్టీ హైకమాండ్​ దృష్టికి తీసుకెళ్తాం.

                                                                                                                                                                     - రామ సహాయం నరేశ్ రెడ్డి, తుమ్మల వర్గం నేత 

Tagged TRS party, , Paleru constituency, TRS Leades

Latest Videos

Subscribe Now

More News