టీచర్ల కక్కుర్తితో ఎగ్జామ్ పేపర్స్ లీక్.. టెన్త్లో ర్యాంకులు తెచ్చుకునేందుకు ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్ల అడ్డదార్లు

టీచర్ల కక్కుర్తితో ఎగ్జామ్ పేపర్స్ లీక్.. టెన్త్లో ర్యాంకులు తెచ్చుకునేందుకు ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్ల అడ్డదార్లు
  • ప్రలోభాలతో ఇన్విజిలేటర్లయిన ప్రభుత్వ టీచర్లకు ఎర
  • టెన్త్​ ఎగ్జామ్ ​ప్రారంభమైన కాపేపటికే వాట్సాప్​లో ప్రత్యక్షమైన క్వశ్చన్ ​పేపర్స్
  • లీక్ ఘటనపై కలెక్టర్ ​సీరియస్.. ఏడుగురు టీచర్ల సస్పెన్షన్

నిజామాబాద్, వెలుగు: విద్యను దందా చేసుకున్న కొన్ని ప్రైవేట్ స్కూల్ మేనేజ్​మెంట్లు టెన్త్​లో ర్యాంకులు తెచ్చుకునేందుకు అడ్డదార్లు తొక్కుతున్నాయి. పరీక్షల నిర్వహణలో భాగస్వామ్యులైన ప్రభుత్వ టీచర్లకు నజరానాలు ఆఫర్ ​చేసి బుట్టలో వేసుకుంటున్నాయి. ప్రలోభాలకు కక్కుర్తిపడ్డ టీచర్లు గౌరవప్రదమైన వృత్తికి కళంకం తెస్తున్నారు. లంచాలు తీసుకుంటూ అక్రమాలకు పాల్పడుతున్నారు.

బుధవారం నిజామాబాద్ ​జిల్లాలోని మూడు ఎగ్జామ్​సెంటర్ల నుంచి పరీక్షలు జరుగుతున్న టైమ్​లోనే క్వశ్చన్ పేపర్స్​ వాట్సాప్​లో బయటకు రావడం తీవ్ర దుమారం రేపింది. ఈ ఉదంతాన్ని సీరియస్​గా పరిగణించిన కలెక్టర్​ ఇలా త్రిపాఠి 9 మంది గవర్నమెంట్ ​టీచర్లను తక్షణమే సస్పెండ్​ చేశారు. తర్వాత వీరిలో ఇద్దరి పాత్ర లేదని తెలిసి సస్పెన్షన్​ ఎత్తివేశారు. క్వశ్చన్ ​పేపర్స్​ లీక్​ కావడానికి గల కారణాలను ఇంటెలిజన్స్​ లోతుగా విచారిస్తోంది. 

ఎగ్జామ్ డ్యూటీలకు పోటీ
జిల్లాలో గవర్నమెంట్ ​ప్రైమరీ, హైస్కూల్స్ 1,156, ప్రైవేట్​స్కూల్స్​465 ఉన్నాయి. వీటిల్లో ఈ ఏడాది 24,399 మంది స్టూడెంట్స్​ టెన్త్​ ఎగ్జామ్స్​ రాస్తున్నారు. గతంలో ఆయా సబ్జెక్టుల్లో ఫెయిలైన సుమారు 100 మంది ప్రైవేట్​గా పరీక్షలు రాస్తున్నారు. వీరందరి కోసం జిల్లాలో 144 ఎగ్జామ్​సెంటర్లను ఏర్పాటు చేసి అదే సంఖ్యలో డిపార్ట్​మెంట్ ఆఫీసర్స్, చీఫ్ ​సూపరింటెండెంట్స్, సిట్టింగ్ ​స్వ్యాడ్​ను నియమించారు. 

ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం, స్కూల్​అసిస్టెంట్​హోదాలోని వీరు పరీక్షల నిర్వహణను ఎక్కడికక్కడ పర్యవేక్షించాలి. ఇన్విజిలేటర్లుగా అపాయింటైన 1,214 ఎస్జీటీల్లో సగం మంది రూముల్లో జరిగే ఎగ్జామ్స్​ను డైరెక్ట్​గా అజమాయిషీ చేయాల్సి ఉండగా.. మిగతా సగం క్లర్క్​విధుల్లో ఉంటారు.

పరీక్షలు మొదలయ్యే నెల రోజుల ముందే ఈ నియామకాలు జరుగుతుండగా కొన్ని ప్రైవేట్​ స్కూల్​ మేనేజ్​మెంట్స్​ ఇందులో కీరోల్​ పోషిస్తున్నాయి. తమకు అనుకూలంగా ఉండే వారిని ఏరికోరి ఎగ్జామ్ డ్యూటీలు వేయించుకొని సెంటర్​వారీగా రూ.2 లక్షలు ముట్టజెబుతున్నట్లు సమాచారం. 

ఇలా తమ స్టూడెంట్స్​కు ఎన్ని సెంటర్లు పడితే అన్నింటికీ ముడుపులు ఇస్తున్నట్లు సమాచారం. దీంతో టెన్త్​ఎగ్జామ్ డ్యూటీలకు పోటీ పెరిగింది. రెండేండ్ల క్రితం బోధన్​లో పది పరీక్ష డ్యూటీలు వేయలేదని కొందరు టీచర్లు కొట్టుకోవడమే ఇందుకు నిదర్శనం. అడ్డదారిలో ర్యాంకులు సాధించి భారీ ఫీజులతో స్కూల్​అడ్మిషన్లు పెంచుకోడానికి చాలా వరకు ప్రైవేట్​స్కూల్స్​ఈ విధానాన్ని పాటిస్తున్నాయి.

క్వశ్చన్ పేపర్స్​ ఫొటోలు వారి కోసమే..
ఈ నెల 14న టెన్త్​పరీక్షలు ప్రారంభం కాగా బుధవారం సెకండ్​ లాంగ్వేజ్​ఎగ్జామ్​జరిగింది. పరీక్ష ప్రారంభం కాగానే నిజామాబాద్ ​జిల్లాలోని మూడు సెంటర్ల నుంచి తెలుగు, హిందీ క్వశ్చన్​ పేపర్స్​బయటకు రావడం కలకలం రేపింది.

ఉదయం 9.30 గంటలకు షురూ కాగా ఆలూర్​ జడ్పీ హైస్కూల్​సెంటర్​ నుంచి వాట్సాప్​​లో బయటకు వచ్చిన తెలుగు ప్రశ్నాపత్రం నిజామాబాద్​లోని 4 ప్రముఖ ప్రైవేట్​స్కూళ్ల స్టూడెంట్ల​ ప్రయోజనం కోసం పంపినట్లు తెలుస్తోంది. మెండోరా జడ్పీ స్కూల్​నుంచి బయటకు వచ్చిన హిందీ పేపర్​ఆర్మూర్, బాల్కొండలోని ప్రైవేట్ మేనేజ్​మెంట్స్​కోసమని ప్రాథమికంగా తేలింది.

బోధన్​లోని గవర్నమెంట్ జూనియర్ ​కాలేజీ​ సెంటర్​ నుంచి వచ్చిన తెలుగు క్వశ్చన్​పేపర్​వెనుక అక్కడి టౌన్ ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్​మెంట్ల ప్రమేయం ఉందని గుర్తించారు. 3 సెంటర్ల నుంచి బయటకు వచ్చిన క్వశ్చన్​ పేపర్స్​ సోషల్​ మీడియాలో వైరలవుతున్న విషయాన్ని పోలీసులు గుర్తించి విద్యాశాఖ ఆఫీసర్స్​కు చెప్పేదాకా వారికి తెలియకపోవడం గమనార్హం. ఘటనను సీరియస్​గా పరిగణించిన కలెక్టర్ బాధ్యులైన టీచర్లను సస్పెండ్ ​చేశారు. ఇంకా జరగాల్సిఉన్న 5 సబ్జెక్టుల పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. పేపర్స్​ లీక్​పై ఇంటెలిజన్స్​పోలీసులు డిటైల్డ్​ ఎంక్వైరీ చేపట్టారు.