బడ్జెట్ బ్రేకింగ్ : ఇంటర్ వరకు బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్న భోజనం

బడ్జెట్ బ్రేకింగ్ : ఇంటర్ వరకు బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్న భోజనం

తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నది. పిల్లల చదువు, ఆరోగ్యానికి సంబంధించి.. బడ్జెట్ ప్రసంగంలో సంచలన ప్రకటన చేశారు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క. 

ఒకటో తరగతి నుంచి ఇంటర్ మీడియట్ కాలేజీ వరకు కొత్తగా బ్రేక్ ఫాస్ట్ పథకం అమల్లోకి తీసుకురాబోతున్నట్లు వెల్లడించారాయన. ఈ విద్యా సంవత్సరం నుంచే ఈ పథకం అమల్లోకి తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు మంత్రి. ఈ బ్రేక్ ఫాస్ట్ పథకంలో భాగంగా.. మూడు రోజులు పాలు.. మరో మూడు రోజులు రాగి జావ ఇవ్వనున్నట్లు కూడా వెల్లడించారాయన.

అదే విధంగా మధ్యాహ్న భోజనం పథకాన్ని ఇంటర్ కాలేజీలకు అమలు చేయబోతున్నట్లు స్పష్టం చేశారాయన. జూనియర్ కాలేజీల్లోనూ అమలు చేయబోతున్నాం అని.. పిల్లల సంక్షేమం కోసం తీసుకుంటున్న చర్యల్లో ఇది సరికొత్త అధ్యాయానికి నాందిగా అభివర్ణించారు మంత్రి భట్టి విక్రమార్క.

మానవీయ కోణంలో ఇది అద్భుతమైన ముందడుగు అని.. అంతిమ లక్ష్యం మేధస్సును పెంపొందించటం కోసమే అని స్పష్టం చేశారు మంత్రి భట్టి. ప్రతి బిడ్డ, ప్రతి బాలిక, ప్రతి విద్యార్థి కలలకు జీవం పోస్టోందన్నారు. తెలంగాణ పిల్లలు ఎదిగితే.. తెలంగాణ రాష్ట్రమే దేదీప్యమానంగా వెలుగొందుతుందన్న ఉద్దేశంతో ఈ రెండు పథకాలు అమలు చేయబోతున్నట్లు స్పష్టం చేశారు మంత్రి భట్టి. పాఠశాలలు, కాలేజీల్లో వంట గదులు. వంట శాలలు మెరుగుపరిచేందుకు 100 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు వెల్లడించారాయన.