మహబూబ్ నగర్ అర్బన్, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఆరోగ్యానికి, సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని ప్రభుత్వ విప్, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం మహబూబ్ నగర్‌లోని క్యాంపు కార్యాలయంలో 75 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచిన విషయాన్ని గుర్తుచేశారు.
ఆ తర్వాత బాలుర జూనియర్ కాలేజీ గ్రౌండ్లో ‘విశ్వకర్మ ప్రీమియర్ లీగ్’ క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రారంభించారు. స్వయంగా బ్యాటింగ్ చేసి క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపడంతో పాటు విశ్వకర్మలకు అవసరమైన సాంకేతిక సాయం అందిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం తొలి తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ మంత్రి దివంగత పులి వీరన్న 80వ జయంతి సందర్భంగా పద్మావతి కాలనీలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కాగా, యెన్నం శ్రీనివాస్ రెడ్డికి మంత్రి హోదా లభించడం పట్ల జిల్లా అదనపు కలెక్టర్లు హరిప్రియా, మధుసూదన్ నాయక్, డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.
