రాజ్ తరుణ్, రాశి సింగ్ జంటగా రామ్ కడుముల రూపొందించిన చిత్రం ‘పాంచ్ మినార్’. గోవింద రాజు సమర్పణలో మాధవి, ఎంఎస్‌ఎమ్ రెడ్డి నిర్మించారు. నవంబర్ 21న సినిమా విడుదల కానుంది. ఆదివారం ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు.
అతిథిగా హాజరైన దర్శకుడు సాయి రాజేష్ మాట్లాడుతూ ‘రాజ్ తరుణ్ నటించిన ‘కుమారి 21ఎఫ్’ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన కం బ్యాక్ కోసం ఎదురుచూస్తున్న శ్రేయోభిలాషుల్లో నేను ఒకడిని. ఈ సినిమాతో హిట్ కొట్టి మళ్ళీ ఒక లవ్ స్టోరీతో గ్రేట్ పొజిషన్లోకి రావాలని కోరుకుంటున్నా’ అని అన్నారు. రాజ్ తరుణ్ మాట్లాడుతూ ‘ఇదొక క్లీన్ ఎంటర్‌టైనర్. అందరూ ఎంజాయ్ చేసేలా ఉంటుంది.
ఇప్పటికే వేసిన ప్రీమియర్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. రిలీజ్‌కు రెండు రోజుల ముందు మళ్లీ ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నాం. ఎంతో ధైర్యం ఉంటే గాని ఇలా చేయలేం. ఈ సినిమా విజయంపై టీమ్ అంతా గట్టి నమ్మకంతో ఉన్నాం’ అని అన్నాడు. క్లీన్ కామెడీతో ఫ్యామిలీతో కలిసి చూసేలా సినిమా ఉంటుందని హీరోయిన్ రాశి సింగ్ చెప్పింది. డైరెక్టర్ రామ్ మాట్లాడుతూ ‘ఇది ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని చెప్పుకునే క్రైమ్ కామెడీ సినిమా. ఇందులోని ప్రతి క్యారెక్టర్ గుర్తుండిపోతుంది’ అని చెప్పాడు.
మంచి కంటెంట్‌తో రాబోతున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుంటున్నాం అని నిర్మాతలు మాధవి, గోవిందరాజు అన్నారు. నటులు అజయ్ ఘోష్, సుదర్శన్, మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర పాల్గొన్నారు.
