- ఓటర్ల ముందు గ్రామాభివృద్ధి ప్రణాళికలు
- అభ్యర్థుల ఎంపికలో పార్టీల తలమునకలు
- ఒకే ఊరులో ఒకే పార్టీ నుంచి ఐదారుగురు నామినేషన్లు
- విత్‌డ్రా చేయించేలా పార్టీల ప్రయత్నాలు
- పల్లెకు చేరిన ప్రధాన పార్టీల క్యాంపెయిన్
హైదరాబాద్, వెలుగు: పల్లె పోరు పతాక స్థాయికి చేరింది. తొలి విడత ఎన్నికలకు నేటి నుంచి 8 రోజుల సమయం మాత్రమే ఉండటంతో గ్రామాల్లో అభ్యర్థులు ప్రచారాన్ని స్పీడప్ చేశారు. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో అభ్యర్థులు ఇంటింటికెళ్లి తమ విజన్‌ను వివరిస్తున్నారు.
గ్రామాభివృద్ధి కోసం ఐదేండ్ల ప్రణాళికలు రెడీ చేశామని, తమను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ‘గెలిపిస్తే ఇంటింటికీ మినరల్ వాటర్ ఇస్తా.. డ్రైనేజీ సమస్య లేకుండా చేస్తా.. ఊరిలో సీసీ కెమెరాలు పెట్టిస్తా.. గ్రంథాలయం ఏర్పాటు చేస్తా’ ఇలా హామీలిస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.
మహిళా ఓటర్ల కోసం చీరలు, కుంకుమ భరిణెలు ఇతర కానుకలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ‘అవ్వా.. నేను నీ బిడ్డను.. ఒక్కసారి ఆశీర్వదించు’.. అన్న, తమ్ముడు, అక్కాచెల్లీ, అత్త, మామ, బాబాయ్, పిన్ని ఇలా వరుసలు కలుపుతూ పలకరిస్తూ సెంటిమెంట్‌ను ప్రయోగిస్తున్నారు.
అనుచరులతో కలిసి ఇంటింటికీ తిరుగుతూ అందరితో కలుపుగోలుగా ఉంటున్నారు. అయితే, ఓటర్లు మాత్రం గుంభనంగా వ్యవహరిస్తున్నారు. ప్రధాన పార్టీలన్నీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పల్లె రాజకీయం రసవత్తరంగా మారింది.
ఒకే ఊరులో ఒకే పార్టీ నుంచి ఐదారుగురు నామినేషన్లు..
అభ్యర్థుల ఎంపిక వ్యవహారం ప్రధాన పార్టీలకు తలనొప్పిగా మారింది. చాలా గ్రామాల్లో ఒకే పార్టీ నుంచి ఐదారుగురు అభ్యర్థులు నామినేషన్లు వేయడంతో ఇబ్బందులు పడుతున్నారు. రెబల్స్ బెడద తగ్గించేందుకు సీనియర్ లీడర్లు రంగంలోకి దిగారు. నామినేషన్ల ఉపసంహరణకు గడువు దగ్గర పడుతుండటంతో కాంప్రమైజ్ పాలిటిక్స్ జోరందుకున్నాయి.
ఎలాగైనా సర్పంచ్ అభ్యర్థిగా తమకే చాన్స్ వస్తుందన్న ధీమాతో కొందరు.. పార్టీ తరుఫున అవకాశమొచ్చినా.. రాకపోయినా.. బరిలో నిలుస్తామంటూ మరికొందరు అనుకుంటున్నారు. ఎలాగూ నామినేషన్లు వేశామని ఎట్టిపరిస్థితుల్లో వెనక్కి తగ్గేది లేదని తెగేసి చెబుతున్నారు.
ఒక గ్రామంలో ఆయా పార్టీల తరఫున ఐదారుగురు నామినేషన్లు వేయడంతో అసలు అభ్యర్థి ఎవరు? రెబెల్ ఎవరు? అన్నది లీడర్లు తేల్చుకోలేకపోన్నారు. ఈ క్రమంలో నామినేషన్లను విత్‌డ్రా చేయించేందుకు పార్టీ అధినేతలతో ఫోన్‌లో మాట్లాడిస్తూ, హామీలు ఇప్పిస్తున్నారు.
ముఖ్యంగా గెలుపును ప్రభావితం చేసే నియోజకవర్గాల్లో బుజ్జగింపు రాజకీయాలు తారాస్థాయికి చేరాయి. ఇప్పుడు నామినేషన్ విత్ డ్రా చేసుకుంటే భవిష్యత్‌లో పార్టీలో కీలక పదవులిస్తామంటూ నమ్మబలుకుతున్నారు. అధికార కాంగ్రెస్‌లో పార్టీలో పదవులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, ఇతర పదవుల్లో అవకాశాలు కల్పిస్తామని నచ్చజెబుతున్నారు. బీఆర్‌ఎస్ పార్టీ విషయానికొస్తే.. ఆ పార్టీలో ఇంతవరకు కమిటీల్లేవ్.. నామినేషన్ విత్ డ్రా చేసుకొని, పార్టీ సపోర్ట్ చేసిన అభ్యర్థికి మద్దతిస్తే.. ఎన్నికలయ్యాక నియమించే కమిటీల్లో చోటిస్తామంటూ మభ్యపెడుతున్నారు.
లొంగకపోతే.. డబ్బులు ఎరగా చూపి ఒప్పిస్తున్నారు. మరోవైపు, కొన్నిచోట్ల బీజేపీ తరుఫున కొంతమంది నాయకులు పోటాపోటీగా నామినేషన్లు వేయడంతో ఈ పార్టీ ఇన్‌చార్జిలు, జిల్లా, రాష్ట్ర స్థాయి నేతలు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
పల్లెకు ప్రధాన పార్టీల క్యాంపెయిన్..
ప్రచారానికి సమయం దగ్గరపడుతుండటంతో ప్రధాన పార్టీల క్యాంపెయిన్ పల్లెకు చేరింది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ తమ మద్దతుదారులను గెలిపించుకునేందుకు స్పెషల్ ఫోకస్ పెట్టాయి. పార్టీలకు సంబంధం లేకుండా జరిగే ఎన్నికలే అయినా.. తమ వాళ్లే గెలవాలనే పట్టుదలతో మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్-చార్జిలు, తదితర నాయకులు పల్లెబాట పట్టారు.
పంచాయతీల్లో పట్టు సాధించి, రానున్న ఎన్నికలకు గట్టి పునాది వేసేలా ముందుకెళ్తున్నాయి. అందుకే, అభ్యర్థుల ఎంపికలో ఆచీతూచి వ్యవహరిస్తున్నారు. ప్రజాబలం ఎవరికి ఉంది? అపోజిషన్ పార్టీ తరఫున ఎవరు బరిలో నిలుస్తున్నారు? వారికి దీటైన క్యాండెట్మన పార్టీలో ఎవరున్నారనే వేటలో ప్రధాన పార్టీల నేతలు నిమగ్నమయ్యారు.
