ఏసీబీ వలలో పంచాయతీ సెక్రటరీ

ఏసీబీ వలలో పంచాయతీ సెక్రటరీ
  • ఇంటి నంబర్ ఇచ్చేందుకు రూ.10 వేలు లంచం డిమాండ్
  • రూ.3 వేలు తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన కార్యదర్శి

మోత్కూరు, వెలుగు : ఇంటి నంబర్ ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేసిన ఓ పంచాయతీ కార్యదర్శి రూ.3 వేలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. బాధితుడు, ఏసీబీ ఆఫీసర్ల కథనం ప్రకారం..యాదాద్రి జిల్లా మోత్కూరు మండలం పొడిచేడుకు చెందిన ఓ బాధితుడు ఈ మధ్యే ఇల్లు కట్టుకుని ఇంటి నంబర్ కోసం గ్రామ పంచాయతీలో దరఖాస్తు చేసుకున్నాడు. గ్రామ పంచాయతీ సెక్రటరీ చిన్నం కిరణ్ రూ.10 వేలు డిమాండ్ చేశాడు.

దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. పంచాయతీ కార్యదర్శి కిరణ్​కు ఫోన్ చేసి డబ్బులు ఇస్తానని చెప్పగా బుధవారం మధ్యాహ్నం ఎంపీడీవో ఆఫీస్ దగ్గరకు రమ్మన్నాడు. ఆఫీస్ కు వచ్చి సెక్రటరీ కిరణ్​కు రూ.3 వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. పంచాయతీ కార్యదర్శి కిరణ్ తన ఇంటికి నంబర్ ఇవ్వడానికి రూ.10 వేలు లంచం అడిగాడని, తాను అంత ఇవ్వలేనని చెప్పి ఇది వరకే రూ.5 వేలు ఇచ్చానని, అయినా మళ్లీ డబ్బులు అడగడంతో ఏసీబీ ఆఫీసర్లను ఆశ్రయించినట్టు బాధితుడు చెప్పాడు.

కిరణ్ ను అదుపులోకి తీసుకుని హైదరాబాద్ ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ ఉమ్మడి నల్లగొండ రేంజ్ డీఎస్పీ జగదీశ్​చందర్ తెలిపారు. ప్రభుత్వ ఆఫీసర్లు ఎవరైనా లంచం అడిగితే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064కు, ఉమ్మడి నల్లగొండ రేంజ్ డీఎస్పీ నంబర్ 9154388918 కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. వెంట ఇన్ స్పెక్టర్ వెంకట్ రావు, సిబ్బంది ఉన్నారు.