న్యాయం చేయకుంటే బీఆర్‌ఎస్‌ను గద్దె దించుతాం

న్యాయం చేయకుంటే బీఆర్‌ఎస్‌ను గద్దె దించుతాం

హనుమకొండకలెక్టరేట్‌‌/మహబూబాబాద్‌‌ అర్బన్‌‌/జనగామ అర్బన్‌‌, వెలుగు : తమకు న్యాయం చేయకపోతే బీఆర్‌‌ఎస్‌‌ను గద్దె దించుతామని పంచాయతీ కార్మికులు హెచ్చరించారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌‌ చేస్తూ సోమవారం హనుమకొండ, జనగామ కలెక్టరేట్ల వద్ద ధర్నా నిర్వహించగా, మహబూబాబాద్‌‌లో భారీ ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పంచాయతీ కార్మికులను పర్మినెంట్‌‌ చేయడంతో పాటు, కనీస వేతనం రూ.15,600, రూ. 10 లక్షల ఇన్సూరెన్స్‌‌ కల్పించాలని డిమాండ్‌‌ చేశారు. కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల కోసం సమ్మె చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోకపోవడం సరికాదన్నారు.

ఏపీలో కార్మికులకు రూ.18 వేలు ఇస్తుంటే, తెలంగాణలో మాత్రం రూ.8,500 ఇస్తున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని కోరారు. హనుమకొండలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు టి.ఉప్పలయ్య, నాయకులు ఐలయ్య, చిరంజీవి, మహబూబాబాద్‌‌లో కుంట ఉపేందర్, రేషపల్లి నవీన్, బిల్లకంటి సూర్యం, శివారపు శ్రీధర్, జనగామలో జేఏసీ చైర్మన్ రాపర్తి రాజు, బొట్ల శ్రీనివాస్, యాకయ్య పాల్గొన్నారు.