ఆఫర్ లెటర్లు రెడీ : త్వరలో పంచాయతీ కార్యదర్శులకు పోస్టింగ్స్‌

ఆఫర్ లెటర్లు రెడీ : త్వరలో పంచాయతీ కార్యదర్శులకు పోస్టింగ్స్‌

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: జూనియర్ పంచాయతీ కార్యదర్శి పోస్టులకు ఎంపి కైన వారికి త్వరలో ఆఫర్ లెటర్లు ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున అనుమతి కోసం సీఈవో రజత్ కుమార్‌‌‌‌కు పంచాయతీ రాజ్ శాఖ ఉన్నతాధికారులు లేఖ రాశారు. నేడో రేపో అనుమతి రావొచ్చని భావిస్తున్నారు. పంచాయతీ కార్యదర్శి పరీక్ష నిర్వహణ, ఫలితాల్లో అవకతవకలు జరిగాయని కొందరు హైకోర్టును ఆశ్రయించడంతో ఆఫర్‌‌‌‌ లెటర్లు ఇవ్వొద్దంటూ స్టే ఇచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు సబ్జెక్టు నిపుణులు పరీక్ష పేపర్‌‌‌‌, నియామక విధానాన్ని పరిశీలించి నివేదిక ఇచ్చారు. దీన్ని పరిశీలించిన కోర్టు స్టే ఎత్తి వేసింది. దీంతో అధికారులు 9,355 మందికి ఆఫర్‌‌‌‌ లెటర్లు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

నెలలుగా ఎదురుచూపు

జూనియర్ పంచాయతీ కార్యదర్శి పోస్టులకు 2018 ఆగస్టులో నోటిఫికేషన్ విడుదలైంది. సుమారు 5 లక్షల 18 వేల మంది అప్లై చేసుకున్నారు. గత ఏడాది అక్టోబర్ 10న పరీక్ష నిర్వహించి డిసెంబర్ 19న ఫలితాలు విడుదల చేశారు. ఆ తర్వాత రెండు రోజులకే సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయింది. అయితే కొందరు కోర్టుకెక్కడంతో ఎంపి క ప్రక్రియ ఆలస్యమైంది.

సర్పంచ్‌ లొచ్చారు.. కార్యదర్శులే లేరు

ఇటీవలే 12,731 పంచాయతీల్లో పాలక వర్గాలు కొలువు దీరాయి. కానీ చాలా గ్రామాల్లో కార్యదర్శు లు లేరు. 9,355 జూనియర్ పంచాయతీ కార్యదర్శు లకు ఆఫర్‌‌‌‌ లెటర్స్‌‌‌‌ ఇచ్చేస్తే సమస్య కొద్ది మేర పరిష్కారం కానుంది. నియామకాల్లో జాప్యం జరగకుంటే సర్పంచ్‌‌‌‌లతోపాటే పంచాయతీ కార్యదర్శులకూ శిక్షణ పూర్తయ్యేది. ఇప్పుడు వీరికి ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వాల్సి ఉంది.