ఆ కోడి నాదే.. వేలం వేయొద్దు.. ఆర్టీసీ వేలంలో కొత్త ట్విస్ట్

ఆ కోడి నాదే.. వేలం వేయొద్దు.. ఆర్టీసీ వేలంలో కొత్త ట్విస్ట్

హైదరాబాద్:  కరీంనగర్‌ ఆర్టీసీ బస్సులో దొరికిన పందెం కోడి వ్యవహారం కొత్త మలుపు తిరిగింది.  ప్రయాణికుడు బస్సులో మర్చిపోయిన పందెం కోడిని డిపోకు తీసుకువచ్చిన డ్రైవర్, కండక్టర్.. ఉన్నతాధికారులకు అందించగా వారు వేలం ప్రకటన వేసిన విషయం తెలిసిందే.  ఇవాళ  మధ్యాహ్నం 3 గంటలకు వేలం వేయనున్నట్లు  ప్రకటన విడుదల చేశారు. అంతలోనే కోడి యజమాని ఎంట్రీ ఇచ్చాడు. తన కోడిని తనకు ఇవ్వాలని కోరుతున్నాడు.

ఈ నెల 8 వ తేదీన నెల్లూరుకు చెందిన మహేశ్  కరీంనగర్ 2 డిపోకు చెందిన బస్సులో బయల్దేరాడు. అయితే తెల్లవారుజామున కావడంతో నిద్రమత్తులో కరీంనగర్ బస్టాండ్‌లో బస్సు దిగి వెళ్లిపోయాడు. అయితే నెల్లూరుకు వెళ్లిన తర్వాత తనకు కోడిని మరిచిపోయిన విషయం తెలిసిందని చెప్పాడు. ఈ క్రమంలోనే కరీంనగర్ 2 ఆర్టీసీ డిపో అధికారులు పందెం కోడిని వేలం వేస్తున్నారనే విషయం తెలుసుకున్న మహేశ్ ఆ కోడి తనదే అంటూ ఓ సెల్ఫీ వీడియో విడుదల చేయడం ప్రస్తుతం సంచలనంగా మారింది.