వలస కూలీల కాలినడకకు ఫేక్ న్యూస్ కారణం

వలస కూలీల కాలినడకకు ఫేక్ న్యూస్ కారణం

రాజ్య సభలో కేంద్రం స్పష్టం

న్యూఢిల్లీ: కరో్నా లాక్‌‌డౌన్ కారణంగా వలస కూలీలు పడిన కష్టాల గురించి తెలిసిందే. తమ స్వస్థాలకు చేరుకోవడానికి వందలాది కిలో మీటర్లు కాలినడకన నడుచుకుంటూ వెళ్లారు. ఈ విషయంపై పార్లమెంట్‌‌లో కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఫేక్ న్యూస్ వల్ల భయపడిన వలస కూలీలు తమ ఇళ్లకు కాలినడకన బయలుదేరారని కేంద్రం తెలిపింది. మైగ్రంట్ వర్కర్స్ తమ ఇళ్లకు చేరుకోవడానికి వందలాది కిలోమీటర్లు ఎందుకు నడుస్తూ వెళ్లాల్సి వచ్చిందని త‌ృణమూల్ మెంబర్ మాలా ప్రశ్నించారు. మరో ఇద్దరు ప్రతిపక్ష సభ్యులు కూడా ఇదే విషయంపై ప్రశ్నించగా.. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ సమాధానం ఇచ్చారు.

ఫేక్ న్యూస్‌‌కు మైగ్రంట్ వర్కర్స్ భయపడ్డారని, తమకు కనీస అవసరాలైన ఆహారం, తాగునీరు, ఆరోగ్య సదుపాయాలు, వసతి దొరకవేమోనని ఆందోళన చెందారని రాయ్ చెప్పారు. ఈ విషయంపై ప్రభుత్వం పూర్తి అప్రమత్తతతో వ్యవహరించిందన్నారు. ఫుడ్, డ్రింకింగ్ వాటర్, మెడికల్ ఫెసిలిటీస్ విషయంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా తగిన చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా విధించిన లాక్‌‌డౌన్‌‌తో కరోనా విస్తృత వ్యాప్తిని అడ్డుకున్నామని వివరించారు.