
పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కుమార్తె సంచలన వ్యాఖ్యలు చేశారు. మానాన్న మమ్మల్నే పట్టించుకోవడం లేదు.. ఇక రాష్ట్రాన్నేం పట్టించుకుంటారని భగవంత్ మాన్ మీద ఆయన కుమార్తె సీరత్ కౌర్ సంచలన ఆరోపణలు చేశారు. తమ తండ్రి మద్యం తాగి అధికారిక కార్యక్రమాలకు మాత్రమే కాక.. గురుద్వారాకు కూడా వెళ్లారని ఆరోపించారు.కడుపున పుట్టిన బిడ్డల గురించే పట్టించుకోని వ్యక్తి.. రాష్ట్రాన్ని ఎలా చూసుకుంటారని ఆమె ప్రశ్నించారు. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో సంచలనంగా మారాయి.
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మొదటి భార్య కుమార్తె సీరత్ కౌర్.. తన తండ్రిపై సంచలన ఆరోపణలు చేస్తూ ఓ వీడియో విడుదల చేశారు. దానిని శిరోమణి అకాలీదళ్ నాయకుడు బిక్రమ్ సింగ్ మజితియా శనివారం ( డిసెంబర్ 9) మీడియాకు వెల్లడించారు. ఈ వీడియోల్లో సీరత్ కౌర్ మాట్లాడుతూ.. ‘‘నేను ఈ వీడియో చేయడం వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదు. నా కథ బయటకు రావాలని మాత్రమే కోరుకుంటున్నాను. నేను, మా తల్లి చాలా కాలం మౌనంగా ఉన్నాం. మా మౌనాన్ని మా బలహీనతగా భావించరాదు. మేము మౌనంగా ఉన్నందుకే ఆయన ప్రస్తుతం ఉన్నత స్థానంలో కూర్చున్నారు’’ అంటూ తండ్రి భగవంత్ మాన్ పై ఆరోపణలు చేశారు.
సీరత్ మాట్లాడుతూ..‘‘మా నాన్న మద్యం సేవించి అధికారిక కార్యక్రమాలకు మాత్రమే కాక గురుద్వారాకు కూడా వెళ్లారు. మా నాన్న ప్రస్తుతం తన రెండో భార్య ద్వారా మూడో బిడ్డకు తండ్రి కాబోతున్నాడు. ఈ విషయాన్ని మేము ఇతరుల ద్వారా తెలుసుకున్నాం. నన్ను, నా సోదరుడిని మాన్ పట్టించుకోవడం లేదు.. పక్కకు పెట్టారు. ఇద్దరు చిన్న పిల్లలను వదిలేసిన వ్యక్తి మూడో బిడ్డకు ఎందుకు జన్మనివ్వాలని అనుకుంటున్నామన్నారు. అతడు తన కడుపున పుట్టిన పిల్లల బాధ్యతనే సరిగా నిర్వర్తించలేకపోయారు.. అలాంటి వ్యక్తి పంజాబ్‌ను సమర్థవంతంగా నడిపించే బాధ్యతను ఎలా నిర్వర్తిస్తారు’’ అని ఆమె వీడియోలో ప్రశ్నించారు.
. @BhagwantMann की बेटी ने जो आरोप भगवंत मान पर लगाये है बेहद गंभीर हैं । चाहे वो भगवंत मान द्वारा अपने बेटे को CM हाउस में घुसने से रोकना हो या गुरुद्वारे और विधानसभा में शराब पीकर जाना हो चाहे वो शराब पीकर अपनी पत्नी के साथ घटिया हरकते करना हो । @ArvindKejriwal क्या इन आरोपों… pic.twitter.com/k9QbYZUKK1
— Tajinder Bagga (@TajinderBagga) December 9, 2023
తన తండ్రి, సీఎం మాన్ ను కలవడానికి తన సోదరుడు దోషన్ చేసిన ప్రయత్నాల గురించి కూడా సీరత్ కౌర్ వీడియోలో చెప్పుకొచ్చారు. ‘‘ మా సోదరుడిని సీఎం ఇంటి లోనికి రానివ్వలేదు. ఆయన పర్యటనల సమయంలో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నాం. మాన్ మమ్మల్ని మానసిక, శారీరక వేధింపులకు గురి చేశారు. మద్యం తాగుతారు.. అబద్ధాలు చెప్తారు. మద్యం మత్తులో అధికారిక కార్యక్రమాలకు మాత్రమే కాక గురుద్వారాకు కూడా వెళ్తారు ’’ అంటూ వీడియోలో ఆరోపించింది.
ఈ వీడియోను బీజేపీ నేత తజిందర్ పాల్ సింగ్ బగ్గా ‘ఎక్స్’ హ్యాండిల్ లో షేర్ చేశారు. భగవంత్ మాన్ పై మండిపడ్డారు. శిరోమణి అకాలీదళ్ బిక్రమ్ సింగ్ మజితియా కూడా పలు విమర్శలు చేశారు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి