పంత్ ఫామ్ లో కి రావాలంటే, ఆటకు దూరంగా ఉండాల్సిందే!

పంత్ ఫామ్ లో కి రావాలంటే, ఆటకు దూరంగా ఉండాల్సిందే!

ప్రస్తుతం భారత క్రికెట్ లో ఉన్న గట్టి పోటీని తట్టుకొని అంతర్జాతీయ క్రికెట్ లో 125 మ్యాచ్ లు ఆడటం అంటే మామూలు విషయం కాదు. అలాంటిది ధోనీ వారసునిగా వచ్చిన రిషబ్ పంత్ ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ లో నాలుగు ప్రపంచకప్ లు (2019,20,21,22) ఆడేసాడు. ఇంత అనుభవం ఉన్న పంత్, ఈ మధ్య కాలంలో టెస్ట్ క్రికెట్ లో తప్ప మిగితా ఏ ఫార్మాట్ లో అంతగా రాణించడం లేదు. అయినా బీసీసీఐ సెలక్టర్లు పంత్ పై భరోసా ఉంచి అవకాశాలు ఇస్తూనే ఉన్నారు. దీనిపై క్రికెట్ అభిమానులతో సహా,  క్రికెట్ నిపుణులంతా సెలక్టర్లపై ఫైర్ అవుతున్నారు. ఫామ్ లో ఉన్నవాళ్లను పక్కన పెట్టి  పంత్ ని ఆడించడంపై విమర్శిస్తున్నారు. అయితే, కొందరు మాత్రం ఈ కష్ట కాలంలో పంత్ కు అండగా నిలబడుతున్నారు. పంత్ ఆట తిరిగి గాడిలో పడాలంటే.. కొన్ని రోజులు ఆటకు దూరంగా ఉండాలని సలహాలు ఇస్తున్నారు.

తీవ్ర విమర్శలు, ఒత్తిడి, బోర్డ్ నిర్ణయాల వల్ల ఫామ్ కోల్పోయిన విరాట్ కోహ్లీని చూసి అందరూ, తన పని అయిపోయింది. ఇక రిటైర్మెంట్ ప్రకటిస్తాడు. విఫలమవుతున్నా ఇంకా ఎందుకు ఛాన్స్ లు ఇస్తున్నారని సెలక్టర్లని తిట్టారు. దాంతో దాదాపు రెండు నెలలు క్రికెట్ కి దూరంగా ఉండి, తిరిగి ఆసియా కప్ లో కంబ్యాక్ ఇచ్చి అందరి నోళ్లను మూయించాడు విరాట్. హార్దిక్ కూడా అంతే. వెన్నెముక సర్జరీ తర్వాత టీం లోకి వచ్చిన హార్దిక్, తన ఆటతో అంతగా ఆకట్టుకోలేకపోయాడు. కొన్ని రోజులు క్రికెట్ కి దూరమై ఐపీఎల్ తో మంచి కంబ్యాక్ ఇచ్చి మళ్లీ టీం లోకి వచ్చాడు. 

ఇప్పుడు రిషబ్ పంత్ విషయంలోనూ అలానే జరగుతుందని అంటున్నారు విశ్లేషకులు. విరామం లేని షెడ్యూల్ కారణంగా అలసిపోయిన పంత్ కు రెస్ట్ ఇస్తే తిరిగి ఫామ్ అందుకునే అవకాశం ఉంటుందని చెప్తున్నారు.