కిచెన్ తెలంగాణ : తక్కువ ఇంగ్రెడియెంట్స్​తో బొప్పాయితో భలే కమ్మగా.. సింపుల్ స్వీట్స్

కిచెన్ తెలంగాణ : తక్కువ ఇంగ్రెడియెంట్స్​తో బొప్పాయితో భలే కమ్మగా.. సింపుల్ స్వీట్స్

సమ్మర్​ అంటే ఒకవైపు ఎండలు, మరోవైపు తియ్యని పండ్లు. ఎప్పుడూ పెద్దగా పండ్లు తినని వాళ్లు కూడా ఈ వేసవి సమయంలో రకరకాల ఫ్రూట్స్ లాగించేస్తారు. వాటిలో ఒకటి ఈ బొప్పాయి. సాధారణంగా బొప్పాయి పండును కొందరు  నేరుగా తింటారు. కొందరు జ్యూస్ చేసుకుంటారు. అయితే ఈ పండుతో కొందరు వెరైటీ రెసిపీలు కూడా చేస్తుంటారు. వాటిలో అందరికీ నచ్చే స్వీట్లు కూడా ఉన్నాయి. వీటిని తక్కువ ఇంగ్రెడియెంట్స్​తో చాలా సింపుల్​గా తయారుచేసుకోవచ్చు. మరింకెందుకాలస్యం.. వెంటనే పపాయని ఓ పట్టు పట్టేయండి. 

ఐస్​క్రీమ్​

కావాల్సినవి :

బొప్పాయి పండు ముక్కలు : ఒక కప్పు
పాలు : ఒక లీటర్
కస్టర్డ్ పొడి, వెన్న : ఒక్కోటి రెండు టేబుల్ స్పూన్లు
చక్కెర : ముప్పావు కప్పు

తయారీ : పాన్​లో పాలు పోసి అవి సగం అయ్యేవరకు కాగబెట్టాలి. తర్వాత ఆ పాలలో వెన్న వేసి కలపాలి. గిన్నెలో కస్టర్డ్ పొడి వేసి, కాచిన పాలు పోసి బాగా కలిపి పక్కన పెట్టాలి. ఈ కస్టర్డ్ పాలను కూడా మిశ్రమంలో వేసి కలపాలి. అందులో చక్కెర వేసి కరిగేవరకు కలపాలి. చివరిగా బొప్పాయి పండు గుజ్జు వేసి రెండు నిమిషాలు ఉడికించాలి. ఈ మిశ్రమాన్ని కాసేపు చల్లారనివ్వాలి. ఆ తర్వాత వడకట్టి, ఒక బాక్స్​లో వేసి మూతపెట్టాలి. 

ఆ బాక్స్​ను ఫ్రిజ్​లో పెట్టి 12 గంటలు ఉంచాలి. అయితే మూడు గంటలకు ఒకసారి తీసి ఒకసారి మిక్సీలో గ్రైండ్ చేసి మళ్లీ బాక్స్​లో వేయాలి. అలా రెండుసార్లు చేశాక బాక్స్​లో వేసి మూతపెట్టి ఆరుగంటలపాటు ఫ్రిజ్​లో ఉంచాలి. 

బర్ఫీ

కావాల్సినవి : 

బొప్పాయి : ఒకటి
చక్కెర పొడి : ముప్పావు కప్పు
కస్టర్డ్ పొడి : అర కప్పు
పాలు : రెండు కప్పులు
నెయ్యి : రెండు టేబుల్ స్పూన్లు
కొబ్బరి పొడి : సరిపడా

తయారీ : బొప్పాయి పండు తొక్క తీసి ముక్కలుగా కట్ చేయాలి. వాటిని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఒక గిన్నెలో గుజ్జును వేసి అందులో కస్టర్డ్ పొడి, చక్కెర పొడి వేసి పాలు పోసి అన్నీ కలిసేలా బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని పాన్​లో పోసి సన్న మంట మీద ఉడికించాలి. ఉండలు కట్టకుండా గరిటెతో తిప్పుతూ ఉండాలి. తర్వాత నెయ్యి వేసి కలపాలి. ఆ మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేసి సమాంతరంగా పరవాలి. కాసేపటి వరకు పక్కన ఉంచి చల్లారనివ్వాలి. గట్టిపడిన తర్వాత ముక్కలుగా కట్​ చేసి కొబ్బరి పొడిలో దొర్లించాలి. 

బొప్పాయి లడ్డు

కావాల్సినవి :

బొప్పాయి పండు : సగం 
పచ్చి కొబ్బరి : ఒక కప్పు
చక్కెర : పావు కప్పు
పాల పొడి : మూడు టీస్పూన్లు
బాదం, జీడిపప్పు : కొంచెం
నెయ్యి : ఒకటిన్నర టేబుల్ స్పూన్

తయారీ : బొప్పాయి పండును ముక్కలుగా చేసి మిక్సీ పట్టాలి. మరోపాన్​లో పచ్చి కొబ్బరి వేసి వేగించి పక్కన పెట్టాలి.  పాన్​లో నెయ్యి వేడి చేసి అందులో బాదం, జీడిపప్పు పలుకులు వేసి వేగించాలి. అందులో బొప్పాయి గుజ్జును వేసి కలపాలి. మిశ్రమం దగ్గర పడ్డాక అందులో కొబ్బరి పొడి, తర్వాత చక్కెర కూడా వేయాలి. అవన్నీ కలిశాక పాల పొడి వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని కాస్త వేడి మీదే లడ్డులాగ చేయాలి. వాటిని కొబ్బరి పొడిలో దొర్లించాలి.