పారా మెడికల్ కాలేజీల దందా

పారా మెడికల్ కాలేజీల దందా

హైదరాబాద్, వెలుగు: ప్రైవేట్ పారామెడికల్ కాలేజీల దందాకు అనుకూలంగా రాష్ట్ర సర్కార్ మరో నిర్ణయం తీసుకుంది. గడిచిన అకడమిక్ ఇయర్‌‌‌‌ అడ్మిషన్ల కోసం కొత్తగా నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 93 కాలేజీల్లో అక్రమంగా జరిగిన అడ్మిషన్లను, ఇప్పుడీ నోటిఫికేషన్ ద్వారా రెగ్యులరైజ్ చేసే చర్యలకు పూనుకుంది. రాష్ట్రంలో దాదాపు 206 కాలేజీలకు ప్రభుత్వం నుంచి గుర్తింపు లేదని 2019 లో అప్పటి బోర్డు సెక్రటరీ గోపాల్‌‌‌‌రెడ్డి ప్రకటించారు. ఆయా కాలేజీల్లో స్టూడెంట్లను చేర్చుకోవడానికి ఆయన నిరాకరించారు. 2019 – 20 అకడమిక్ ఇయర్‌‌‌‌‌‌‌‌ అడ్మిషన్ల కోసం ఇచ్చిన నోటిఫికేషన్ నుంచి ఈ 206  కాలేజీలను తీసేశారు. ప్రభుత్వం నుంచి గుర్తింపు పొందిన కాలేజీలకు మాత్రమే స్టూడెంట్లను చేర్చుకోవడానికి అనుమతించారు. కానీ, అడ్మిషన్‌‌‌‌ ప్రాసెస్‌‌‌‌లో ఉన్న లోపాలను అడ్డు పెట్టుకుని అనుమతి లేని చాలా కాలేజీలు స్టూడెంట్లను చేర్చుకున్నాయి. బోర్డు పెద్దలకు ఈ విషయం తెలిసినా ఆయా కాలేజీల యాజమాన్యాలపై చర్యలు తీసుకోలేదు. ఆ తర్వాత వచ్చిన బోర్డు సెక్రటరీ కూడా ఈ విషయాన్ని పట్టించుకోలేదు. పైగా అనుమతి లేని కాలేజీలకు కూడా స్కాలర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌, రీయింబర్స్‌‌‌‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఈ–పాస్ లాగిన్ ఇచ్చారు. ఆయా కాలేజీలు పెట్టుకున్న రీయింబర్స్‌‌‌‌మెంట్, స్కాలర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌ల అప్లికేషన్లకు అప్రూవల్‌‌‌‌ కూడా వచ్చేసింది.

ఇప్పుడే ఎందుకు?

పారామెడికల్ కోర్సులకు రెండేండ్లకు ఒకసారి ఎగ్జామ్స్‌‌‌‌ నిర్వహిస్తారు. 2019 నోటిఫికేషన్ ద్వారా అడ్మిటైన స్టూడెంట్లకు 2021 మేలో ఎగ్జామ్స్ పెట్టాల్సి ఉంది. కానీ, కరోనా కారణంగా ఇప్పటివరకూ ఎగ్జామ్స్ నిర్వహించలేదు. కరోనా తగ్గిన తర్వాత ఎగ్జామ్స్ నిర్వహించాల్సి ఉంది. అయితే, గుర్తింపు లేని కాలేజీల్లో చేరిన స్టూడెంట్స్‌‌‌‌కు ఎగ్జామ్స్ నిర్వహించే అవకాశం లేకపోవడంతో కొత్త డ్రామాకు తెరలేపారు. 2019–20 అడ్మిషన్ల నోటిఫికేషన్‌‌‌‌కు, ఎక్స్‌‌‌‌టెన్షన్‌‌‌‌ నోటిఫికేషన్ పేరిట ఇప్పుడు అడ్మిషన్లు చేసుకోవడానికి 93 కాలేజీలకు పర్మిషన్ ఇచ్చారు. అంటే, గతంలో దొడ్డిదారిన ఈ కాలేజీలు చేర్చుకున్న స్టూడెంట్లనే, ఇప్పుడు చేరినట్టుగా చూపించనున్నారు. ఇదే అంశంపై బోర్డు సెక్రటరీ, డాక్టర్ రవీందర్ నాయక్‌‌‌‌ను ప్రశ్నించగా, ఆయా కాలేజీల్లో హైపవర్ కమిటీ తనిఖీలు చేసి, వాటిల్లో అడ్మిషన్లకు క్లియరెన్స్ ఇచ్చిందని తెలిపారు. ఆయా కాలేజీల్లో అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ ఇవ్వాలని కిందటేడాది మే నెలలో ప్రభుత్వం తమకు సూచించిందని చెప్పారు. హైపవర్ కమిటీ, ప్రభుత్వ  సూచనల మేరకు ఇప్పుడు ఎక్స్‌‌‌‌టెన్షన్ నోటిఫికేషన్ ఇచ్చామని ఆయన వివరించారు.

ఇదెట్ల సాధ్యం?

రెండేండ్ల కిందటే గడిచిపోయిన అకడమిక్ ఇయర్‌‌‌‌‌‌‌‌లో ఇప్పుడు స్టూడెంట్లు ఎట్ల చేరుతారన్న ప్రశ్నకు బోర్డు సెక్రటరీ సరైన సమాధానం ఇవ్వలేదు. పారామెడికల్ కోర్సుల్లో చేరడానికి ఇంటర్ అర్హత ఉండాలి. ఏటా ఇంటర్ రిజల్ట్ తర్వాత, మే చివర్లో లేదా జూన్‌‌‌‌లో పారామెడికల్ కోర్సుల్లో చేరడానికి నోటిఫికేషన్ ఇస్తారు. అంటే, 2021–22 అకడమిక్ ఇయర్‌‌‌‌‌‌‌‌కు ఇప్పుడు నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది. కానీ, ఇంకా ఇంటర్‌‌‌‌‌‌‌‌ ఎగ్జామ్స్ కానేలేదు. ఇవేమీ పట్టించుకోకుండా ఎక్స్‌‌‌‌టెన్షన్ నోటిఫికేషన్ పేరిట దొడ్డిదారి అడ్మిషన్ ప్రక్రియకు తెరలేపారు. ఈ అడ్మిషన్ ద్వారా అడ్మిట్ అవ్వడానికి ఇంటర్‌‌‌‌ పూర్తయిన పిల్లలు లేరు. ఒకవేళ గతంలో పాస్ అవుట్ అయిన పిల్లలు ఎవరైనా చేరినా, వాళ్లు 2021-–22, 2022–23 అకడమిక్ ఇయర్‌‌‌‌‌‌‌‌లోనే పారామెడికల్ కోర్సులు చదువుకోవాల్సి ఉంటుంది. ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయాక ఇచ్చే రెగ్యులర్ నోటిఫికేషన్ ద్వారా చేరే పిల్లలు కూడా ఇవే అకడమిక్ ఇయర్‌‌‌‌‌‌‌‌లో చదువుకోవాల్సి ఉంటుంది. అలాంటప్పుడు, ఇప్పుడీ ఎక్స్‌‌‌‌టెన్షన్ నోటిఫికేషన్ ఎందుకు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇదే విషయాన్ని బోర్డు సెక్రటరీ దగ్గర ప్రస్తావించగా.. ఆయా కాలేజీలకు జరిగిన అన్యాయాన్ని సెటిల్ చేయాలని ప్రభుత్వం సూచించిందని, సెటిల్‌‌‌‌మెంట్‌‌‌‌లో భాగంగానే నోటిఫికేషన్ ఇచ్చామని ఆయన చెప్పుకొచ్చారు.