శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్‌లో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య భీకర ఎన్ కౌంటర్ జరుగుతోంది. ఈ క్రమంలో ఉగ్రవాదుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడి భారత సైన్యం ప్రత్యేక దళాల (SF) పారాట్రూపర్ హవల్దార్ గజేంద్ర సింగ్ వీర మరణం పొందినట్లు అధికారులు వెల్లడించారు. కిష్త్వార్‌లో రెండవ రోజు కూడా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందని తెలిపారు.
ఆదివారం కిష్త్వార్‌లోని (జనవరి 18) చత్రో బెల్ట్ మాండ్రాల్-సింగ్‌పోరా సమీపంలోని సోనార్ గ్రామంలో జైష్-ఎ-మొహమ్మద్ (జెఎం) ఉగ్రవాదులు నక్కి ఉన్నట్లు నిఘా వర్గాల ద్వారా సైన్యానికి సమాచారం అందింది. వెంటనే భద్రత దళాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో సైన్యం రాకను గమనించిన ఉగ్రమూకలు జవాన్ల బృందంపై గ్రనేడ్ విసిరారు. ఈ ఘటనలో ఎనిమిది మంది సైనికులు గాయపడ్డట్లు అధికారులు తెలిపారు. గాయపడ్డ జవాన్లను ఆర్మీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఇందులో తీవ్రంగా గాయపడిన పారాట్రూపర్ హవల్దార్ గజేంద్ర సింగ్ చికిత్స పొందుతూ కన్నుమూసినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు ఘటన స్థలంలో రెండో రోజు కూడా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఉగ్రవాదులను భద్రత దళాలు చుట్టుముట్టినట్లు తెలిపారు. అయితే.. ఆపరేషన్ జరుగుతోన్న ప్రాంతం కఠినంగా ఉండటంతో ఆపరేషన్‌ను క్లిష్టతరంగా మారిందని చెప్పారు.
