మీతో మీరే పోటీపడాలె .. పరీక్షా పే చర్చాలో స్టూడెంట్లకు మోదీ సూచన

మీతో మీరే పోటీపడాలె ..  పరీక్షా పే చర్చాలో స్టూడెంట్లకు మోదీ సూచన

న్యూఢిల్లీ:  పిల్లలు అన్ని రకాల ఒత్తిళ్లను తట్టుకొని శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత టీచర్లు, తల్లిదండ్రులపైనే ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. స్టూడెంట్లు ఎదుర్కొంటున్న సవాళ్లను సమష్టిగా పరిష్కరించాలని సూచించారు. కొంతమంది పేరెంట్స్ తమ పిల్లల ప్రోగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిపోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సొంత విజిటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా భావిస్తుంటారని తెలిపారు. ఇది మంచి పద్ధతి కాదని, ఎదుటివాళ్ల దగ్గర తమ పిల్లలను ఎప్పుడూ తక్కువ చేసి మాట్లాడొద్దన్నారు. తమ పిల్లలను మరొకరితో ఎప్పుడూ పోల్చొద్దని చెప్పారు. పోటీ ప్రపంచంలో మీతో మీరే పోటీ పడాలని స్టూడెంట్స్​కు సూచించారు. ఎగ్జామ్స్​కు ముందు స్టూడెంట్స్​లో ఒత్తిడి పోగొట్టేందుకు ప్రధాని మోదీ సోమవారం ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమం నిర్వహించారు. ఢిల్లీలోని భారత మండపంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో మాట్లాడారు. ఈ సందర్భంగా పిల్లలకు ప్రధాని సలహాలు, సూచనలిచ్చారు. 

కష్టపడే స్టూడెంట్స్​తో ఫ్రెండ్​షిప్ చేయాలి

‘‘మన పిల్లల్లో ఆత్మస్థైర్యం పెంచాలి. ఒత్తిడి ఎదుర్కోవడంలో వారికి సాయం చేయాలి. పిల్లలను పట్టించుకోకపోతే వాళ్లలో ఒత్తిడి పెరుగుతుంది. అన్ని సమయాల్లో ఒత్తిడి తట్టుకునేలా వాళ్లను దృఢంగా చేయాలి. భవిష్యత్తులో ఒత్తిడి పెరుగుతూనే ఉంటదనే విషయాన్ని కూడా వారికి తెలియజేయాలి. ఇంటెలిజెంట్, కష్టపడి పని చేసే పిల్లలతో ఫ్రెండ్​షిప్ చేయించాలి. వాళ్ల నుంచి పిల్లలు ఎంతో స్ఫూర్తి పొందుతారు. వేరే పిల్లలతో పోలుస్తుంటే వాళ్లు డిప్రెషన్​లోకి పోతరు. మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది’’అని పేరెంట్స్, టీచర్స్ కు మోదీ సూచించారు. లైఫ్​లో సక్సెస్ కాని కొంత మంది పేరెంట్స్.. వారి పిల్లల రిపోర్ట్ కార్డ్​ను తమ విజిటింగ్ కార్డుగా చేసుకుంటున్నారన్నారు. స్టూడెంట్స్ ఎదుర్కొనే ఒత్తిడి మూడు రకాలుగా ఉంటుందని తెలిపారు. తమలో తాము, పక్కనోళ్ల నుంచి, పేరెంట్స్ నుంచి ప్రెషర్ ఫీల్ అవుతారన్నారు. పిల్లలకు చిన్న చిన్న లక్ష్యాలే ముందు ఇవ్వాలని, దాంతో వారి పనితీరు మెరుగుపడుతుందని చెప్పారు. పెద్ద లక్ష్యం వారి ముందు ఉంచితే.. ఎగ్జామ్స్ సరిగ్గా రాయలేరని తెలిపారు. ముందుగా.. ఎలాంటి ఒత్తిడి అయినా తట్టుకునే సామర్థ్యం పేరెంట్స్ కలిగి ఉండాలన్నారు.

పిల్లల ఉజ్వల భవిష్యత్తు వారి చేతుల్లోనే..

‘‘టీచర్స్ తమ వర్క్​ను కేవలం ఒక జాబ్​గా భావించకూడదు. విద్యార్థుల జీవితాలను బలోపేతం చేసే సాధనంగా మార్చుకోవాలి. పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు పునాది వేయాలి. కాంపిటీషన్, చాలెంజ్​లు మన జీవితంలో ఎంతో ప్రేరణ కలిగిస్తాయి. ఏ విషయంలోనూ స్టూడెంట్స్ పక్కవాళ్లతో పోటీ పడొద్దు.. మీతో మీరే పోటీపడాలి. హెల్దీ లైఫ్​తో స్టడీస్​ను ఎలా బ్యాలెన్స్ చేయాలన్న స్టూడెంట్స్ క్వశ్చన్​కు మోదీ సమాధానం ఇచ్చారు. ‘‘చాలా మంది స్టూడెంట్స్ సెల్​ఫోన్లు ఉపయోగిస్తుంటారు. గంటల తరబడి వాటిని పట్టుకుని కూర్చోవద్దు. పడుకునే ముందు రీల్స్ అస్సలు చూడొద్దు. మొబైల్​ను చార్జింగ్ చేస్తున్నట్టే.. మన బాడీని కూడా చార్జింగ్ చేసుకోవాలి. అది నిద్రతోనే సాధ్యం అవుతుంది. మంచి ఆరోగ్యానికి.. మంచి నిద్ర ఎంతో ముఖ్యం. నేను అవసరం ఉంటేనే ఫోన్ వాడుతాను. సెల్ వాడకం తగ్గించేందుకు స్క్రీన్ టైమ్ అలర్ట్ టూల్ ఉపయోగించాలి. ఫోన్ చూస్తూ టైమ్ మరిచిపోవద్దు. సమయాన్ని గౌరవించాలి. పిల్లల ఫోన్ల పాస్​వర్డ్​లు పేరెంట్స్​కు తెలిసి ఉండాలి’’అని మోదీ అన్నారు. ప్రతి ఇంట్లో ‘నో గ్యాడ్జెట్’ జోన్ ఉండాలి. ఫ్యామిలీతో ఉన్నప్పుడు, బెడ్​పై పడుకున్నప్పుడు.. డైనింగ్​ టేబుల్ వద్ద కూర్చున్నప్పుడు కమ్యూనికేట్ చేయడానికి ఫోన్లు ఉపయోగించొద్దు’’అని మోదీ సూచించారు. 

నేను 30 సెకన్లలోనే నిద్రలోకి జారుకుంట

‘‘నేను 30 సెకన్లలోనే నిద్రలోకి జారుకుంటాను. 365 రోజులూ ఇలాగే పడుకుంటాను. మెలకువ ఉంటే.. మాత్రం పూర్తిగా అలర్ట్​గా ఉంటాను. కానీ.. నిద్రపోతున్నప్పుడు మాత్రం.. గాఢంగా పడుకుంటాను. మనిషి శరీరానికి పోషకాహారం కూడా అవసరం. ప్రతి ఒక్కరూ తప్పకుండా ఎక్సర్​సైజ్ చేయాలి. స్టూడెంట్స్ అందరూ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. సెల్​ఫోన్లు, ల్యాప్​టాప్​ల కారణంగా చేత్తో రాయడమే మానేస్తున్నారు. చదువుకు కేటాయించిన సమయంలో.. 50 శాతం టైమ్.. రైటింగ్ ప్రాక్టీస్​కు కేటాయించాలి’’అని మోదీ సూచించారు. 

140 కోట్ల మంది నాతోనే ఉన్నరు

‘‘నేను ప్రతి చాలెంజ్​ను.. సవాల్ చేస్తాను. సమస్య పరిష్కారం అవుతుందని చూస్తూ కూర్చోవద్దు. అలాంటి వాళ్లు జీవితంలో ఏం సాధించలేరు. నా స్వభావం భిన్నంగా ఉంటది. సమస్యలు దానంతట అవే పరిష్కారం అవుతాయని చూస్తూ కూర్చోను. సవాల్​కు నేను ప్రతి సవాల్ విసురుతా. కొత్త విషయాలు నేర్చుకుంట. కొత్త వ్యూహాలు రూపొందించుకుంటాను. ఇదే నా అభివృద్ధికి దోహదపడుతుంది’’అని మోదీ అన్నారు. 140 కోట్ల ప్రజలు నాతో ఉన్నారని, 100 మిలియన్ సవాళ్లు ఉంటే.. బిలియన్ల కొద్దీ పరిష్కారాలు కూడా ఉన్నాయని తెలిపారు. కరోనా టైమ్​లోనే ఇది నిరూపితమైందని, తాను ఒంటరిగా ఉన్నానని ఎప్పుడూ భావించనని చెప్పారు. ‘‘కరోనా కారణంగా ప్రపంచం మొత్తం స్టక్ అయింది. మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండని చెప్పి వదలేయలేదు. ప్రతి రోజూ ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యాను. చప్పట్లు కొట్టమని, ప్లేట్​తో సౌండ్ చేయాలని, దీపాలు వెలిగించాలని కోరాను. దీంతో కరోనా నిర్మూలించలేదు. కానీ.. కరోనాతో పోరాడే సమష్టి బలానికి జన్మ ఇచ్చింది’’అని మోదీ అన్నారు.