
నిర్మల్ జిల్లా దిలావర్ పూర్ మండలకేంద్రంలోని పోలింగ్ బూత్ లోకి రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కొడుకు గౌతంరెడ్డిని అనుమతించడం పట్ల కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. గౌతంరెడ్డి, టీఆర్‍ఎస్ కార్యకర్తలు లోపలికి వెళ్లినా ఎందుకు అడ్డుకోలేదని పోలీసులతో కాంగ్రెస్ కార్యకర్తలు వాగ్వివాదానికి దిగారు. దీంతో కాంగ్రెస్, టీఆర్‍ఎస్ ల మధ్య కొద్ది సేపు వార్ జరిగింది. పరిస్థితి విషమిస్తుందన్న సమాచారంతో నిర్మల్ రూరల్ ఎస్సై రాజు సంఘటన స్థలానికి చేరుకుని, కాంగ్రెస్ వారిని అక్కడ నుంచి వెళ్లిపోవాలని సూచించారు. దీంతో మరోసారి కాంగ్రెస్ ఆందోళనకు దిగింది.
లోపలికి వెళ్లిన వారిని ఏమనకుండా తమను వెళ్లమనడం ఎంటని ఎస్సై మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్రిక్తత పెరిగి పోతుండటంతో పోలీసులు 144సెక్షన్ విధించారు. పోలీసుల తీరును కాంగ్రెస్ నేతలు తప్పుబట్టారు. ఓటు వేయకోతే అభివృద్ధి నిలిపి వేస్తామంటూ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మరిచిపోక ముందే ఈ ఘటన జరగడం విశేషం
తిన్నాకే పోలింగ్..
పోలింగ్ ప్రారంభమైన తర్వాత టిఫిన్ చేసేందుకు దిలావర్ పూర్ మండలంలోని కాల్వ పోలింగ్ కేంద్రంలో ఎన్నికల సిబ్బంది పోలింగ్ ను ఆపేశారు. ఓటర్లు పోలింగ్ కేంద్రం వద్ద బారులు తీరినప్పటికీ టిఫిన్ చేసేందుకు వెళ్లడం పట్ల ఓటర్లు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇదేంటని అడిగితే తాము తిన్నాకే పోలింగ్ మొదలుపెడతామని సిబ్బంది తేల్చి చెప్పడంతో ఓటర్లు అసహనంగా వేచి ఉన్నారు.