అడ్డగోలుగా పార్కింగ్ బాదుడు

అడ్డగోలుగా పార్కింగ్ బాదుడు
  • ప్రభుత్వ ఉత్తర్వులను ఎక్కడా పట్టించుకోవట్లే
  • కార్పొరేట్ హాస్పిటల్స్​లో గంటల లెక్కన వసూలు
  • మెట్రో, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలోని పార్కింగ్​పై నో క్లారిటీ  

హైదరాబాద్, వెలుగు: వెహికల్ తో సిటీలోని ఎక్కడికి వెళ్లినా పార్కింగ్ ఫీజుల బాదుడు తప్పడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం 2018లో ప్రత్యేకంగా రిలీజ్​చేసిన జీఓ.68ని ఎవరూ పట్టించుకోవట్లేదు. షాపింగ్​మాల్స్, హాస్పిటల్స్, కమర్షియల్ కాంప్లెక్స్​లలో ఎట్టి పరిస్థితుల్లో పార్కింగ్ ఫీజు వసూలు చేయొద్దని నిబంధనలు ఉన్నా ఖాతరు చేయడం లేదు. పెద్ద మాల్స్, కార్పొరేట్ హాస్పిటల్స్​లో అయితే గంటల చొప్పున వసూలు చేస్తున్నారు. ఫోర్ వీలర్​కి 3 గంటల లోపు రూ.50, టూ వీలర్​కు 5 గంటల లోపు రూ.30 తీసుకుంటున్నారు. ఆ తరువాత గంటకి రూ.10 చొప్పున కట్టాల్సిందే. మెట్రో రైల్, బస్టాప్, రైల్వే స్టేషన్లలో పార్కింగ్ ఫీజు ఎంత వసూలు చేయాలనే దానిపై జీఓ.68లో క్లారిటీ లేకపోవడంతో పార్కింగ్​నిర్వాహకులు అడ్డగోలుగా దండుకుంటున్నారు. జీఓలోనే క్లారిటీ లేదని ఆఫీసర్లు కూడా ఫైన్లు వేసి వదిలేస్తున్నారు.
ఏజెన్సీల ఇష్టం 
సింగిల్ స్క్రీన్ సినిమా హాళ్లు, మెట్రో, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లతోపాటు ఓపెన్ స్పేస్​లో పార్కింగ్ ఫీజు వసూలు చేసే చాన్స్ ఉంది. ఇందుకు టెండర్లు పిలిచి ఆయా ఏరియాలను ఏజెన్సీలకు అప్పగిస్తారు. అయితే ఇక్కడ ఎంత వసూలు చేయాలనే దానిపై ప్రభుత్వం క్లారిటీగా చెప్పకపోవడంతో నిర్వాహకులు అడ్డదిడ్డంగా దోచేస్తున్నారు. టూవీలర్​కి బస్టాండ్​లో డైలీ రూ.60, రైల్వే స్టేషన్ లో రెండు గంటలకు రూ.15, ఆ తర్వాత గంటకు రూ.10, 17–24 గంటలలోపు అయితే రూ.180 వసూలు చేస్తున్నారు. ఫోర్ వీలర్ కు రైల్వేస్టేషన్​లో రెండు గంటలకు రూ.50, ఆ తర్వాత గంటకు రూ.50 వసూలు చేస్తున్నారు. పికప్​అండ్​డ్రాపింగ్ పాయింట్ వద్ద 8 నిమిషాల వరకు ఫ్రీగా వేచి ఉండే అవకాశం ఉండగా, ఆ తర్వాత 15 నిమిషాల లోపు రూ.100, 30 నిమిషాల లోపు రూ.200 అంతకు మించితే రూ.500 వసూలు చేస్తున్నారు. 

ఫిర్యాదు చేయండిలా
షాపింగ్ మాల్స్, ప్రైవేట్, ప్రభుత్వ హాస్పిటల్స్, కమర్షియల్ కాంప్లెక్స్ లో ఎక్కడైనా వాటి బిల్డింగ్ నిర్మించే సమయంలో మొత్తం స్పేస్​లో 40 శాతం పార్కింగ్​ స్పేస్ ని కల్పిస్తున్నట్లు పర్మిషన్ తీసుకుంటారు. దాన్ని పార్కింగ్​కు కేటాయిస్తే అక్కడ వెహికల్ పార్కింగ్​కు పైసలు కట్టాల్సిన అవసరం లేదని సర్కారు జీవోలు చెబుతున్నాయి. ఇందుకు భిన్నంగా పార్కింగ్​వసూలు చేస్తే జీహెచ్ఎంసీ ఎన్ ఫోర్స్​మెంట్​ఆఫీసర్లకు డైరెక్ట్​గా గానీ, ట్విట్టర్​లో గానీ ఫిర్యాదు​చేయొచ్చు.  ఇందుకు పార్కింగ్​ఫీజు రసీదు ఉంటే సరిపోతుంది. ఆఫీసర్లు పరిశీలించి నిర్వాహకులకు రూ.50వేల ఫైన్​వేస్తారు. ఏదైనా డౌట్ ఉంటే హెల్ప్​లైన్ నంబర్ 040–21111111 కి కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. 

అన్నిచోట్లా ఇంతే..
జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్​లో ఫోర్ వీలర్ కి 3 గంటల లోపు రూ.50, టూ వీలర్​కి 5 గంటల లోపు రూ.30 వసూలు చేస్తున్నారు. ఆ తరువాత గంటకి రూ.10 చొప్పున తీసుకుంటున్నారు. పార్కింగ్​ఫీజు కలెక్ట్ చేస్తున్న వారిని అడిగితే హాస్పిటల్ వారువేసిన టెండర్ దక్కించుకొనే కలెక్ట్​చేస్తున్నామని సమాధానం ఇస్తున్నారు. నిమ్స్ హాస్పిటల్ లో ఫోర్ వీలర్ కి 24 గంటలకు రూ.50, టూవీలర్ కి 12 గంటలకు రూ.10 కలెక్ట్ చేస్తున్నారు. ఇటీవల జీహెచ్ఎంసీ ఎన్​ఫోర్స్​ మెంట్​అధికారులు రూ.50 వేలు ఫైన్ వేశారు. అయినప్పటికీ తిరిగి పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్నారు. సికింద్రాబాద్ సీటీసీ లో టూ వీలర్ కి రూ.10 తీసుకుంటున్నారు. ఏరియా హాస్పిటల్స్​లోనూ ఇదే దందా కొనసాగుతోంది. ఇలా ప్రభుత్వ, ప్రైవేట్ అని లేకుండా ఎక్కడికి పోయినా పార్కింగ్​బాదుడు తప్పడం లేదు. 

రోజూ రూ.50 పార్కింగ్​ ఫీజుకే..
మా నాన్నకు ఆరోగ్యం బాగలేకపోతే నిమ్స్ లో అడ్మిట్ చేశాం. కారుని పార్కింగ్​లో పెట్టాం. రోజుకు రూ.50 చొప్పున పార్కింగ్​ఫీజు తీసుకున్నారు. 5 రోజులకు రూ.250 అయ్యింది. కట్టకపోతే కారును బయట పెట్టుకోవాలన్నారు. పేషెంట్​కు వేలల్లో బిల్లులు వేస్తున్న హాస్పిటల్స్​ ఫ్రీగా పార్కింగ్ కల్పించకపోతే ఎట్లా? - సిద్ధేశ్వర్, పేషెంట్ అటెండెంట్

20 నిమిషాలకు రూ.50 ఇచ్చిన..
జూబ్లీహిల్స్​అపోలో హాస్పిటల్​పార్కింగ్​లో కారు పెట్టి 20 నిమిషాలు లోపలికి వెళ్లి వచ్చిన. అందుకు రూ.50 తీసుకున్నారు. ఇంత పెద్ద ఆస్పత్రిలో పార్కింగ్​ఫీజు కలెక్ట్ చేయడం ఏంటో అర్థం కావట్లేదు.   -రాజేష్, పేషెంట్ బంధువు

రూ.50 వేలు ఫైన్ వేస్తం
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం కమర్షియల్ భవనాల్లో ఎక్కడా పార్కింగ్​ ఫీజులు వసూలు చేయకూడదు. సర్కారైనా, ప్రైవేట్ హాస్పిటల్స్ అయినా ఫ్రీగా పార్కింగ్ కల్పించాల్సిందే. ఎక్కడైనా వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి తీసుకొస్తే రూ.50 వేల ఫైన్​వేస్తాం. ఎన్ని ఫిర్యాదులు వస్తే అన్నిసార్లు ఫైన్లు వేస్తాం.  - శ్యామ్, జీహెచ్ఎంసీ ఎన్​ఫోర్స్ మెంట్ ఆఫీసర్