
న్యూఢిల్లీ, వెలుగు: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 9 వరకూ జరగనున్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఓట్ ఆన్ అకౌంట్ (మధ్యంతర) బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. 31న బడ్జెట్ సమావేశాలను ప్రారంభిస్తూ పార్లమెంట్ ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. తర్వాతి రోజు ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అయితే ఈ బడ్జెట్ లో మహిళా రైతులకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద ఇచ్చే నగదు సాయాన్ని రెట్టింపు చేసే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇక ఏప్రిల్, మేలో లోక్‌సభ ఎన్నికలు రానుండటంతో బడ్జెట్ సమావేశాల్లో కేంద్రం ఏమైనా కీలక ప్రకటనలు చేస్తుందా అనే ఉత్కంఠ నెలకొంది. కాగా బడ్జెట్ సమావేశాల అనంతరం ఏ క్షణమైనా లోక్‌సభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉంది.