పార్లమెంట్లో ‘సర్’పై రచ్చ.. ఓటర్ల జాబితా సవరణపై చర్చకు ప్రతిపక్షాల పట్టు

పార్లమెంట్లో ‘సర్’పై రచ్చ.. ఓటర్ల జాబితా సవరణపై చర్చకు ప్రతిపక్షాల పట్టు
  • వెల్​లోకి దూసుకెళ్లి ఆందోళన
  • ఎన్డీయే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు
  • ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆగ్రహం
  • స్పీకర్ సముదాయించినా వినిపించుకోని సభ్యులు
  • తొలిరోజే ఉభయ సభల్లో కొనసాగిన వాయిదాల పర్వం
  • ఆందోళనల మధ్యే మ‌‌ణిపూర్ జీఎస్టీ బిల్లుకు ఆమోదం

న్యూఢిల్లీ, వెలుగు: ఓటర్ల జాబితా సవరణ (సర్)పై చర్చించాలని డిమాండ్ చేస్తూ అపొజిషన్ పార్టీల నేతలు ఉభయ సభల్లో నిరసన తెలిపారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల తొలి రోజే సభ్యులు ఆందోళనకు దిగారు. ప్లకార్డులు పట్టుకుని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెల్​లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో అటు రాజ్యసభ, ఇటు లోక్​సభలో సోమవారం వాయిదాల పర్వం కొనసాగింది. సర్​కు వ్యతిరేక నినాదాలతో ఉభయ సభలు దద్దరిల్లాయి. పొద్దున సభ మొదలవ్వగానే.. ఇటీవల మృతి చెందిన సభ్యులకు లోక్​సభ సంతాపం ప్రకటించింది. వన్డే ప్రపంచ కప్ గెలిచిన టీమిండియా మహిళల జట్టుకు సభ్యులు అభినందనలు తెలిపారు. 

ఆ తర్వాత ప్రశ్నోత్తరాల నిర్వహించేందుకు లోక్​సభ స్పీక‌‌‌‌ర్ ఓం బిర్లా సిద్ధమయ్యారు. దీంతో సర్​పై చ‌‌‌‌ర్చించాల‌‌‌‌ని పట్టుబడుతూ అపోజిషన్ పార్టీల నేతలు వెల్​లోకి దూసుకెళ్లారు. స్పీకర్ ఎంత సముదాయించినా సభ్యులు వినిపించుకోలేదు. సర్​పై చర్చకు సిద్ధపడకపోవడంతో ప్రతిపక్ష పార్టీల ఎంపీలు వెల్​లోనే నిలబడి నిరసన తెలిపారు. ఎన్డీయే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించారు. సర్ పేరుతో ఓట్ల తొలగింపు ఆపాలంటూ నినాదాలు చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయొద్దంటూ ఆందోళన చేపట్టారు. దీంతో స‌‌‌‌భ‌‌‌‌లో తీవ్ర గంద‌‌‌‌ర‌‌‌‌గోళం ఏర్పడింది. 

అన్ని అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పీకర్ ఓం బిర్లా చెప్పినా సభ్యులు వినిపించుకోలేదు. ‘‘ప్రజలు మిమ్మల్ని పార్లమెంట్​కు పంపింది నినాదాలు, ఆందోళనలు చేయడానికా? సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధమని చెప్పినా వినిపించుకోవడం లేదేం? ప్రశ్నోత్తరాలకు ప్రతిపక్షాలు సహకరించాలి’’ అని స్పీకర్ ఓం బిర్లా అన్నారు. దీంతో సభ ప్రారంభమైన కొన్ని నిమిషాల్లోనే వాయిదాపడింది.

కీలక బిల్లులు ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్

మధ్యాహ్నం 12 గంటలకు సభ ప్రారంభమైన తర్వాత కూడా ప్రతిపక్ష సభ్యుల ఆందోళనలు కొనసాగాయి. నిరసనల మధ్య కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పలు బిల్లులను ప్రవేశపెట్టారు. 1944 నాటి సెంట్రల్ ఎక్సైజ్ బిల్లును సవ‌‌‌‌రించ‌‌‌‌నున్నట్లు ఆమె వెల్లడించారు. ఆరోగ్య భద్రత, నేషనల్ సెక్యూరిటీ బిల్లును కూడా ప్రవేశ‌‌‌‌పెట్టారు. జాతీయ భ‌‌‌‌ద్రత‌‌‌‌, ప్రజా ఆరోగ్యం కోసం నిధులు పెంచాల‌‌‌‌ని కోరుతూ బిల్లును రూపొందించారు. మ‌‌‌‌ణిపూర్‌‌‌‌కు చెందిన జీఎస్టీ స‌‌‌‌వ‌‌‌‌ర‌‌‌‌ణ బిల్లును ప్రవేశ‌‌‌‌పెట్టారు. 

మరోవైపు సర్, ఢిల్లీ బాంబు పేలుడు, ఢిల్లీలో కాలుష్యంపై చర్చ జరగాల్సిందేనంటూ కాంగ్రెస్ తో పాటు ప్రతిపక్ష పార్టీల ఎంపీలు పట్టుబట్టారు. దీంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. అనంత‌‌‌‌రం ప్రారంభ‌‌‌‌మైన స‌‌‌‌భ‌‌‌‌లో మ‌‌‌‌ణిపూర్‌‌‌‌కు చెందిన జీఎస్టీ స‌‌‌‌వ‌‌‌‌ర‌‌‌‌ణ బిల్లును మూజువాణి ఓటుతో ఆమోదించుకున్నారు. ఆ తర్వాత స‌‌‌‌భ‌‌‌‌ను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు.

ధన్​ఖడ్​కు సరైన గౌరవం దక్కలే: మల్లికార్జున ఖర్గే

ఉప‌‌‌‌ రాష్ట్రప‌‌‌‌తి సీపీ రాధాకృష్ణన్.. రాజ్యస‌‌‌‌భ చైర్మన్​గా తొలిసారి బాధ్యత‌‌‌‌లు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రతిప‌‌‌‌క్షనేత మ‌‌‌‌ల్లికార్జున ఖ‌‌‌‌ర్గే మాట్లాడారు. మాజీ ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్​ఖడ్​కు సరైన రీతిలో ఫేర్​వెల్ దక్కలేదన్నారు. దీనిపట్ల బాధగా ఉందని తెలిపారు. ధన్​ ఖడ్ ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలని కోరారు. 

అంతకుముందు ప్రధాని మోదీ, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ చైర్మన్ సీపీ రాధాకృష్ణన్​కు అభినందనలు తెలిపారు. ఖర్గే వ్యాఖ్యలపై పార్లమెంట్ వ్యవ‌‌‌‌హారాల శాఖ మంత్రి కిర‌‌‌‌ణ్ రిజిజు స్పందించారు. ధన్​ఖడ్​ రాజీనామా ఒక ప్రత్యేక సందర్భం అన్నారు. గ‌‌‌‌తంలో ధన్​ఖడ్​తో ప్రతిపక్షాలు దారుణంగా ప్రవర్తించాయని, ఆ విషయాన్ని మరిచిపోవద్దని హితవు పలికారు.