తనిఖీలతో తిప్పలు..ఎక్కడపడితే అక్కడ ఎలక్షన్​ చెక్‌‌పోస్టులు

తనిఖీలతో తిప్పలు..ఎక్కడపడితే అక్కడ ఎలక్షన్​ చెక్‌‌పోస్టులు
  • హైదరాబాద్​లో పోలీసుల అత్యుత్సాహం
  • రద్దీ రోడ్లపై బారికేడ్లతో ట్రాఫిక్ జామ్స్
  • రూ.50‌‌‌‌ వేలకు మించి దొరికితే సీజ్
  • విచారణ పేరుతో గంటల తరబడి స్టేషన్లలో
  • డబ్బు విడిపించుకునేందుకు జనం అష్టకష్టాలు

హైదరాబాద్‌‌/నెట్​వర్క్, వెలుగు : ఎలక్షన్‌‌ కోడ్‌‌ అమలులో భాగంగా చెక్​పోస్టుల పేరుతో పోలీసులు చేస్తున్న తనిఖీలతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. గడిచిన నాలుగు రోజుల్లో ఏ రాజకీయ పార్టీ నుంచి గానీ, ఏ ఒక్క లీడర్​ నుంచి పైసా గానీ పట్టుకోని పోలీసులు.. వ్యక్తిగత, ఇంటి అవసరాల కోసం తీసుకెళ్తున్న సామాన్యుల సొత్తును ఎక్కడికక్కడ సీజ్​ చేస్తున్నారు. 

 ఎన్నికల నిబంధనల ప్రకారం రూ.50 వేలకు మించి డబ్బులు తీసుకెళ్లాలంటే సరైన పత్రాలు, ఆధారాలు ఉండాలని అధికారులు చెప్తున్నారు. ఈ నిబంధన గురించి తెలియక, తప్పనిసరి అవసరాల కోసం సామాన్యులు తీసెకెళ్తున్న పైసలను పోలీసులు సీజ్​చేస్తున్నారు. తీరా ఐటీ ఆఫీసర్ల నుంచి ఆ డబ్బును తిరిగి విడిపించుకునేందుకు ఆధారాలు పట్టుకొని ఆఫీసర్ల చుట్టూ తిరుగుతున్నారు. 

రూ.50 వేలకు మించి దొరికితే సీజ్​..

ఈ నెల 9న ఎన్నికల షెడ్యూల్​విడుదల కాగా  ఆరోజు నుంచే పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా చెక్​పోస్టులు పెట్టి తనిఖీలు చేస్తున్నారు. ఎలక్షన్​ కోడ్​ముగిసే(డిసెంబర్​5) దాకా రూ.50 వేలకు మించి నగదు తీసుకెళ్లేందుకు ఎవరికీ అనుమతి లేదు. అత్యవసర వైద్యం, కాలేజీ ఫీజులు, వ్యాపారం, పెళ్లిళ్లు, ఇతర అవసరాలకు డబ్బు తీసుకెళ్తున్న వారు సరైన పత్రాలు వెంట ఉంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. కానీ ఎలాంటి ఆధారాలు లేకుండా తనిఖీల్లో ఎవరి దగ్గరైనా రూ.50 వేలకు మించి పట్టుబడితే రెవెన్యూ అధికారుల వద్ద జమ చేస్తున్నారు.

పెద్ద మొత్తంలో డబ్బు పట్టుబడితే మాత్రం  ఐటీ, జీఎస్టీ అధికారులకు సమాచారం అందించి కోర్టులో జమ చేస్తున్నారు. సీజ్​ చేసిన డబ్బు తక్కువగా ఉండి, సరైన ఆధారాలను జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్​కమిటీలకు చూపిస్తే వెనక్కి ఇస్తున్నారు. కానీ ఈ ప్రాసెస్​ చాలా లేటవుతోంది. ముఖ్యంగా చాలామందికి అవగాహన లేకపోవడం వల్ల  అందులోనూ ఎమర్జెన్సీ అవసరాల కోసం డబ్బు తీసుకెళ్తూ పట్టుబడిన వాళ్లు తీవ్ర ఇక్కట్ల పాలవుతున్నారు. హైదరాబాద్​లోని బంజారాహిల్స్‌‌లో రూ.3.5 కోట్లు తప్ప ఎక్కడా పెద్ద మొత్తంలో నగదు సీజ్ కాలేదు. గడిచిన మూడు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ చెక్​పోస్టుల్లో రూ.20 కోట్ల నగదు, రూ.17 కోట్ల విలువైన బంగారం సీజ్​చేయగా, ఈ మొత్తంలో ఏ ఒక్క రాజకీయ నాయకుడిది పైసా లేకపోవడం గమనార్హం. 

గంటల తరబడి స్టేషన్లలో..

హైదరాబాద్ లో  ఎలక్షన్‌‌ కోడ్‌‌ పేరుతో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు.  చెకింగ్‌‌ పేరుతో  నడిరోడ్డు మీద ఆపుతూ ఇబ్బంది పెడుతున్నారు. రద్దీ ఎక్కువగా ఉండే రోడ్లలో బారికేడ్లు పెట్టి ట్రాఫిక్ జామ్ లకు కారణమవుతున్నారు. ఎలాంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ లేకుండా ఎక్కడపడితే అక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి పోలీస్ స్టేషన్‌‌ పరిధిలో దాదాపు ఐదు చెక్ పోస్ట్‌‌లు పెడుతున్నారు.

దీంతో ఒక చెక్‌‌ పోస్ట్‌‌  దాటిన వెంటనే మరో చెక్‌‌ పోస్ట్‌‌ ఉండటంతో అడుగడుగునా వాహనాలు ఆగిపోతున్నాయి. ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లే సమయం, తిరిగి ఇళ్లకు వెళ్లే సమయాల్లో పోలీసులు నాకాబందీ నిర్వహిస్తున్నారు. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్​నిలిచిపోయి.. జనం నానాపాట్లు పడ్తున్నారు. వెహికల్​చెకింగ్​చేసే చోట్ల పోలీసులు మఫ్టీలో డ్యూటీ చేస్తున్నారు. నగదు లావాదేవీలు ఎక్కువగా జరిగే హోల్‌‌సేల్‌‌ మార్కెట్స్, జువెల్లరీ షాప్స్‌‌, బ్యాంకులు, రిజిస్ట్రేషన్ ఆఫీసుల వద్ద నిఘా పెడుతున్నారు. క్యాష్‌‌ బ్యాగ్‌‌ కనిపిస్తే చాలు వారిని చుట్టుముట్టి పట్టుకుంటున్నారు.  పూర్తి వివరాలు తెలుసుకోకుండానే సీజ్ చేస్తున్నారు. వ్యాపారులు, అత్యవసరాల కోసం డబ్బు తీసుకెళ్తున్న వారే ఎక్కువగా పట్టుబడుతున్నారు.

రాజకీయ పార్టీలు, నాయకులతో ఎలాంటి సంబంధాలు లేకపోయినా వారి దగ్గర క్యాష్ సీజ్ చేస్తున్నారు. ఎలక్షన్స్ ముగిసిన తర్వాత తీసుకోవాలని రిసిప్ట్​ ఇస్తున్నారు. తమకు ఎలక్షన్​కమిషన్ నిబంధన గురించి తెలియదని,  అత్యవసరంగా డబ్బులు తీసుకెళ్తున్నామని ఎంతగా బతిమిలాడినా వినడంలేదు. విచారణ పేరిట గంటల తరబడి పోలీస్ స్టేషన్‌‌లో ఉంచుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

‘‘ ఎన్నికల డబ్బు ట్రాన్స్‌‌పోర్ట్ చేయడాన్ని అరికట్టాల్సిన పోలీసులు.. కోడ్‌‌ పేరుతో మా జువెల్లరీ వ్యాపారాన్ని  దెబ్బతీస్తున్నారు. రెగ్యులర్‌‌‌‌గా నగలను వివిధ షాపులకు తీసుకెళ్తుంటాం. మా షాపుల వద్ధ నిఘా పెడుతున్నారు. బంగారం తీసుకెళ్తున్న వర్కర్స్‌‌ను మధ్యలో అరెస్ట్ చేస్తున్నారు. అన్ని ఆభరణాలకు రశీదులు చూపించలేం. పోలీసుల తీరు వల్ల మాకు తీవ్ర నష్టం జరుగుతోంది.’’

‑ పాట్ మార్కెట్ జువెల్లర్స్‌‌ అసోసియేషన్ ప్రతినిధి, సికింద్రాబాద్‌‌

మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కన్నపేటకు చెందిన దుర్గయ్య కూతురు అనారోగ్యానికి గురైంది.  జాండిస్ తో హాస్పిటల్ లో జాయిన్​చేయగా ట్రీట్ మెంట్ కు బాగా ఖర్చయింది. తెలిసిన వారి దగ్గర అప్పు తీసుకుని హాస్పిటల్ బిల్స్ చెల్లించారు. దుర్గయ్య రుణమాఫీ  డబ్బులు ఆయన అకౌంట్ లో జమ కావడంతో గురువారం రామాయంపేట బ్యాంక్ నుంచి రూ. లక్ష డ్రా చేసుకొని అక్కన్నపేటకు వస్తుండగా పోలీసులు తనిఖీలు చేస్తూ అతని దగ్గరున్న డబ్బులు సీజ్​చేశారు. ట్రీట్​మెంట్​కోసం చేసిన అప్పు తీర్చేందుకు బ్యాంక్ నుంచి డ్రా చేసుకొస్తున్నట్టు చెప్పినా వినలేదని  దుర్గయ్య వాపోతున్నారు. ఎంక్వైరీ చేసి డబ్బులు తిరిగి ఇవ్వడానికి ఎంతకాలం పడుతుందోనని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

మేడ్చల్ జిల్లా శ్రీరంగవరం గ్రామానికి చెందిన లక్ష్మీ మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ఉప్పు లింగాపూర్ లో భూమి కొనుగోలు చేశారు. దాన్ని తమ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఈనెల12న స్లాట్ బుక్​చేసుకున్నారు. భూమి అమ్మినవారికి ఇవ్వడానికి రూ.12 లక్షలు తీసుకుని వెళ్తుండగా వెల్దుర్తి శివారులో  చెకింగ్​చేస్తున్న పోలీసులు ఆ డబ్బులు సీజ్ చేశారు. రిజిస్ట్రేషన్​స్లాట్​బుక్​చేసుకున్నట్టు రశీదు  చూపించినా డబ్బులు తిరిగి ఇవ్వలేదని లక్ష్మి వాపోయారు. పోలీసులు డబ్బులు సీజ్​చేయడంతో  రిజిస్ట్రేషన్​ఆగిపోయిందని ఆమె అన్నారు.