
ముషీరాబాద్, వెలుగు: ప్రత్యేక తెలంగాణ కావాలన్న ఇక్కడ జనాల బలమైన ఆకాంక్షను గుర్తించిన కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ రాష్ట్రం ఇస్తేనే కేసీఆర్‌కు సీఎం పదవి వచ్చిందని ముషీరాబాద్ సెగ్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి అంజన్ కుమార్ యాదవ్ అన్నారు. సోమవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ముషీరాబాద్ పరిధిలోని రాంనగర్, బాగ్‌లింగంపల్లి, లంబాడీ తండా, ఈడబ్ల్యూఎస్ క్వార్టర్స్ తదితర ప్రాంతాల్లో పార్టీ నేతలతో కలిసి ఆయన పాదయాత్ర చేశారు.
ఈ సందర్భంగా అంజన్‌కుమార్ మాట్లాడుతూ.. తొమ్మిదిన్నరేండ్ల పాలనలో సీఎం కేసీఆర్ జనాలకు చేసిందేమీ లేదన్నారు. రాష్ట్ర ప్రజలందరూ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ వైపు ఉన్నారని, అధికారంలోకి వస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రతి కార్యకర్త పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. మాజీ కార్పొరేటర్ కల్పనా యాదవ్, పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.