విద్వేషపు అసుర శక్తితో కాంగ్రెస్​ పోరాడుతోంది : రాహుల్ గాంధీ

విద్వేషపు అసుర శక్తితో కాంగ్రెస్​ పోరాడుతోంది : రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ: ద్వేషంతో నిండిన అసుర (రాక్షస) శక్తితో కాంగ్రెస్ పోరాడుతోందని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఇటీవల ముంబైలో నిర్వహించిన భారత్​ జోడో న్యాయ్​యాత్ర ముగింపు సభలో ఆయన “శక్తికి వ్యతిరేకంగా పోరాటం” చేస్తున్నామని చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ కూడా గట్టిగా బదులిచ్చారు. 

తాజా గా రాహుల్ మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశారు. గురువారం కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. "హమారీ అసురి శక్తి సే లడాయి హో రహీ హై, నఫ్రత్ భరీ 'ఆసురి శక్తి' (మేము రాక్షస శక్తి, ద్వేషంతో నిండిన రాక్షస శక్తితో పోరాడుతున్నాం)" అని రాహుల్​ పేర్కొన్నారు. అయితే, రాహుల్​ వ్యాఖ్యలపై బీజేపీ  ఎదురుదాడి చేసింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి నలిన్ కోహ్లీ మాట్లాడుతూ.. "రెండు రోజుల క్రితం హిందూ మతంలో శక్తి ఉందని, దానికి వ్యతిరేకంగా పోరాడుతామని రాహుల్ గాంధీ అన్నారు. ఆ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా గందరగోళం సృష్టించగా.. ఇప్పుడు మళ్లీ అతను అసుర శక్తి గురించి మాట్లాడుతున్నారు’’ అని ఆయన విమర్శించారు.