28 మంది ఉన్న రష్యా ఫ్లైట్ కూలిపోయింది

28 మంది ఉన్న రష్యా ఫ్లైట్ కూలిపోయింది

మాస్కో: రష్యాలో 28మంది ప్రయాణికులతో వెళ్తూ గల్లంతైన విమానం సముద్రంలో కూలిపోయినట్లు గుర్తించారు. తూర్పు కమ్చట్కా ద్వీపం వద్ద ల్యాండింగ్ కు సిద్ధమవుతున్న సమయంలో కూలిపోయినట్లు రెస్క్యూ అధికారులు చెబుతున్నారు. ఫార్ ఈస్ట్ ప్రాంతంలోని పెట్రో పవ్లోస్క్-కామ్ చెట్ స్కీకి నుంచి 28 మందితో బయలుదేరిన ఏఎన్-26 విమానం టేకాఫ్ తీసుకుని పలానా కు బయలుదేరింది. ఈ విమానంలో 22 మంది ప్రయాణికులుండగా మిగిలిన వారు పైలట్ సిబ్బంది. గమ్యస్థానానికి చేరుకోకముందే  ఎయిర్ ట్రాఫిక్ తో సంబంధాలు తెగిపోవడం కలకలం రేపింది. 
ఏదైనా టెక్నికల్ ప్రాబ్లెం వచ్చిందేమోనని అనుమానిస్తూనే.. గల్లంతైన విమానం ఆచూకీ కనుగొనేందుకు ఎయిర్ ఫోర్స్ రంగంలోకి దిగింది. ఏటీసీతో సంబంధాలు తెగిపోయాక సముద్రంలో కూలిపోయిదా.. లేక ల్యాండింగ్ సమయంలో సమీపంలోని బొగ్గు గనుల్లో కూలిపోయిందేమోనన్న అనుమానాలు కలిగాయి. దీంతో రెండు హెలికాఫ్టర్లలో అటు సముద్రంలోనూ.. ఇటు బొగ్గు గని ప్రాంతంలోని గాలింపు చర్యలు చేపట్టారు. 
విమానం గల్లంతు వార్త మీడియాలో హాట్ టాపిక్ గా మారడంతో రష్యా అత్యవసర మంత్రిత్వ విభాగం స్పందించింది. విమానం గల్లంతైనది వాస్తవమేనని.. ఆచూకీ కనుగొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ప్రకటించారు. గల్లంతైన విమానంలో పలానా మేయర్ ఓల్గా మొఖిరేవా కూడా ఉన్నట్లు స్థానిక అధికారులు, మీడియా చెబుతుండడంతో ఆ ప్రాంతంలో హడావుడి పెరిగింది.  
రెస్క్యూ టీమ్ హెలికాఫ్టర్లు, ఎయిర్ ఫోర్స్ బలగాలు గాలింపును ఉదృతం చేశాయి. టెక్నాలజీని ఉపయోగించి శోధిస్తుండగా.. రష్యాలోని తూర్పు కమ్చట్కా ద్వీపకల్పం వద్ద విమానం కూలిపోయిన ఆనవాళ్లు కనిపించాయి. విమానం కూలిపోయే సమయంలో ఆ ప్రాంతం అంతా మేఘావృతమై ఉన్నట్లు వాతావరణశాఖ నివేదికలు పేర్కొన్నాయి. గల్లంతైన విమానంలోని వారి కోసం రెండు నౌకలు బయలుదేరి వెళ్లాయి.