- ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి
అమీన్పూర్(పటాన్చెరు), వెలుగు : మదీనాగూడ నుంచి సంగారెడ్డి చౌరస్తా వరకు చేపట్టిన 65వ నంబర్‌జాతీయ రహదారి విస్తరణ పనుల్లో వేగం పెంచాలని, శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. సోమవారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని ఆర్అండ్బీ గెస్ట్ హౌస్‌లో ఎంపీ రఘునందన్‌రావుతో కలిసి జాతీయ రహదారుల సంస్థ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీహెచ్ఈఎల్ నుంచి రుద్రారం వరకు జాతీయ రహదారి విస్తరణ పనులు నెమ్మదిగా జరుగుతుండడంతో ప్రయాణికులు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇస్నాపూర్, లక్డారం, రుద్రారం తదితర గ్రామాలకు మంచినీటిని సరఫరా చేసే పైపులైన్లు ధ్వంసం కావడంతో తాగునీటి కొరత ఏర్పడిందన్నారు. ఈ సమస్యలతో ప్రజలు తిరగబడే పరిస్థితులు ఏర్పడుతున్నాయని చెప్పారు.
ఈ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదన్నారు. వర్షపు నీరు వెళ్లేందుకు సర్వీసు రోడ్డుపై నిర్మిస్తున్న కాలువలు నాణ్యత లోపంతో ప్రారంభానికి ముందే కూలిపోతున్నాయని చెప్పారు. రోడ్డు విస్తరణ పనుల్లో వేగం పెంచకపోతే రాబోయే రోజుల్లో మరిన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్నారు. సమావేశంలో కార్పొరేటర్ మెట్టు కుమార్‌యాదవ్, జాతీయ రహదారుల సంస్థ డీఈ రామకృష్ణ, ట్రాఫిక్ సీఐ లాలునాయక్, విద్యుత్‌శాఖ డీఈ భాస్కర్, మాజీ ఎంపీపీ యాదగిరియాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్విజయ్, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
ఆధునిక సౌకర్యాలతో పటాన్చెరు డీఎస్పీ ఆఫీస్..
పటాన్చెరు పట్టణంలో ఆధునిక సౌకర్యాలతో డీఎస్పీ ఆఫీస్‌ను నిర్మిస్తున్నట్లు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తెలిపారు. పటాన్చెరు పట్టణంలోని ఎక్సైజ్ఆఫీస్ సమీపంలో రూ.12 కోట్ల సీఎస్ఆర్ నిధులతో 44,010 చదరపు అడుగుల విస్తీర్ణంలో నూతనంగా నిర్మించే డీఎస్పీ ఆఫీస్ భవనానికి ఎమ్మెల్యే సోమ వారం శంకుస్థాపన చేశారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా ఆధునిక వసతులతో సెల్లార్, జీ ప్లస్‌టూ అంతస్తులతో కార్యాలయాన్ని నిర్మించబోతున్నట్లు తెలిపారు. అనంతరం పటాన్చెరు పట్టణంలోని సాకి చెరువు, తిమ్మక్క చెరువులో 3.50 లక్షల చేప పిల్లలను స్థానిక నాయకులతో కలిసి ఆయన విడుదల చేశారు.
