హైదరాబాద్, వెలుగు: జాతిపిత మహాత్మా గాంధీ చూపిన మార్గం ఎప్పటికీ ఆచరణీయమని బీజేపీ జాతీయ నేత, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. గాంధీ బోధించిన సత్యం, అహింస, సాదాసీదా జీవనం, నిస్వార్థ సేవా గుణాలు సమాజానికి ఎల్లప్పుడూ ఆచరణీయమని పేర్కొన్నారు. గాంధీ జయంతి సందర్భంగా నార్సింగి సర్కిల్ వద్ద ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. సమాజంలో శాంతి, సామరస్యం, దేశ సేవకు గాంధీ ఆశయాలే స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
అలాగే, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రీ జయంతి సందర్భంగా దేశానికి ఆయన చేసిన విశిష్ట సేవలను పొంగులేటి స్మరించుకున్నారు. దేశాన్ని రక్షించే సైనికుల త్యాగాలకు, జాతికి అన్నంపెట్టే అన్నదాతల శ్రమకు సమాన గౌరవం దక్కాలని ఆకాంక్షించిన మహనీయుడు శాస్త్రీ అని కొనియాడారు. ఆయన ఇచ్చిన ‘జై జవాన్.. జై కిసాన్’ నినాదం దేశ చరిత్రలోనే చారిత్రాత్మకమైనదని గుర్తుచేశారు.
