చికిత్స కోసం వచ్చి  కరోనా బారినపడుతున్న పేషంట్లు

చికిత్స కోసం వచ్చి  కరోనా బారినపడుతున్న పేషంట్లు
  • గాంధీలో 125 మంది ఇన్ పేషెంటల్లో 60 మంది వాళ్లే
  • 38 మంది గర్భవతులకు ఆస్పత్రిలోనే అంటిన వైరస్
  • రాష్ట్ర వ్యాప్తంగా వారంలో రెండింతలైన కరోనా ఇన్ పేషెంట్లు
  • పోయిన వారం 1,270.. ఇప్పుడు 2,158 మంది

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతుండడంతో దవాఖాన్లలో చేరుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. అయితే, అందులో ఎక్కువ మంది వేరే జబ్బుల ట్రీట్​మెంట్​ కోసం ఆస్పత్రుల్లో చేరి.. కరోనా బారిన పడినోళ్లే ఉంటున్నారు. ప్రస్తుతం ఒక్క గాంధీ ఆస్పత్రిలోనే 125 మంది కరోనా ఇన్​పేషెంట్లు ఉండగా.. అందులో 60 మంది దాకా ఇతర జబ్బులకు ట్రీట్​మెంట్​ కోసం వచ్చి కరోనా బారిన పడ్డారు. యాక్సిడెంట్ల బాధితులు, కాన్పు కోసం దవాఖాన్లలో చేరుతున్న గర్భిణులకూ కరోనా సోకుతోంది. ప్రస్తుతం గాంధీలో 38 మంది గర్భిణులకు కరోనా సోకింది. మరికొందరు యాక్సిడెంట్​ బాధితులున్నారు. కాగా, ఇప్పుడు గాంధీలో ఉన్న కరోనా ఇన్​పేషెంట్లలో నలుగురు మాత్రమే పిల్లలున్నారని నోడల్​ ఆఫీసర్​, డాక్టర్​ ప్రభాకర్​ ‌‌‌‌రెడ్డి ‘వెలుగు’కు తెలిపారు. ఒమిక్రాన్​ నేపథ్యంలో ఇన్​ పేషెంట్లకు అన్ని ఆస్పత్రుల్లోనూ తరచూ కరోనా టెస్టులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే చాలా మంది పాజిటివ్​గా తేలుతున్నారు. కరోనా వచ్చిన వారిని వెంటనే కరోనా వార్డులకు షిఫ్ట్​ చేస్తున్నారు. కరోనా ట్రీట్​మెంట్​ అందుబాటులో లేని హాస్పిటళ్లు గాంధీకి పంపిస్తున్నాయి.

ఆక్సిజన్​పై 898 మంది
ఈ ఒక్క వారంలోనే ఆస్పత్రుల్లో కరోనా ఇన్​పేషెంట్ల సంఖ్య రెండింతలైంది. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో పోయిన వారం 1,270 మంది ఇన్​పేషెంట్లు ఉండగా.. ఇప్పుడు ఆ సంఖ్య 2,158కి పెరిగింది. అందులో ప్రస్తుతం 898 మంది (40 శాతం) ఆక్సిజన్​పై చికిత్స తీసుకుంటున్నట్టు హెల్త్​ డిపార్ట్​మెంట్​లెక్కలు చెప్తున్నాయి. మరో 546 మంది (25 శాతం) ఐసీయూలో ఉన్నారు. ఈ సంఖ్య మరింత పెరిగే చాన్స్ ఉందని అధికారులు, నిపుణులు చెప్తున్నారు. జనవరి చివరి వారం నుంచి ఫిబ్రవరి మూడో వారం వరకూ అడ్మిషన్లు ఎక్కువగా వస్తాయని అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో థర్డ్​ వేవ్​ పీక్స్​కు వెళ్తుందని, ఆ తర్వాత రెండు వారాలదాకా ఆస్పత్రుల్లో చేరికలు ఎక్కువగా ఉండొచ్చని అంటున్నారు.  

2,047 కేసులు, ముగ్గురి మృతి
రాష్ట్రంలో మరో 2,047 మంది కరోనా బారిన పడ్డారు. ఆదివారం 55,883 మందికి టెస్టులు చేస్తే.. గ్రేటర్ హైదరాబాద్‌‌‌‌లో 1,174, రంగారెడ్డిలో 140, మేడ్చల్‌‌‌‌లో 178, మిగిలిన అన్ని జిల్లాల్లో కలిపి 555 మందికి వైరస్ సోకిందని హెల్త్ డిపార్ట్‌‌‌‌మెంట్ ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 7,09,209కి పెరిగింది. వీరిలో ఇప్పటివరకు 6,83,104 మంది కోలుకున్నారని, మరో 22,048 యాక్టివ్ కేసులు ఉన్నాయని బులెటిన్‌‌‌‌లో ఆఫీసర్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో  కరోనాతో ఆదివారం ముగ్గురు చనిపోయారని, మృతుల సంఖ్య 4,057కి పెరిగినట్టు బులెటిన్‌‌లో  చూపించారు.

ఇలాగే ఉంటుందని చెప్పలేం
ఇప్పుడు ఆస్పత్రుల్లో చేరుతున్నోళ్లంతా ఏదో ఒక జబ్బుతో బాధపడుతున్నోళ్లే. ఆరోగ్యంగా ఉన్నోళ్లెవరికీ హాస్పిటళ్లలో చేరేంత సీరియస్​గా లేదు. వేరే ట్రీట్​మెంట్ల కోసం వచ్చి, ఆస్పత్రుల్లోనే కరోనా బారిన పడుతున్నారు. సర్జరీలు, ఇతర ప్రొసీజర్లకు ముందు రొటీన్‌‌గా చేసే టెస్టులో పాజిటివ్ వస్తోంది. దీంతో వారిని గాంధీకి రిఫర్ చేస్తున్నారు. కొన్ని యాక్సిడెంట్​ కేసులు, ప్రెగ్నెంట్​ కేసులూ ఉన్నాయి. ఇక ముందు కూడా ఇలాంటి పరిస్థితే ఉంటుందని చెప్పలేం. వైరస్​ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవడమే మంచిది. 
- డాక్టర్​ రాజారావు, సూపరింటెండెంట్​, గాంధీ హాస్పిటల్

కేసులు పెరిగితే ఇన్​పేషెంట్లు పెరుగుతరు
డెల్టా వేవ్​తో పోలిస్తే ఈసారి హాస్పిటలైజేషన్​ చాలా తక్కువగా ఉంది. కేసుల సంఖ్య పెరిగితే హాస్పిటళ్లలో ఇన్​పేషెంట్లు ఎక్కువుండడం సహజమే. ఫిబ్రవరిలో అడ్మిషన్లు ఇంకా ఎక్కువ పెరుగుతాయి. తీవ్రత మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పటివరకూ డెత్స్​ లేవు. హాస్పిటళ్లలో చేరినవాళ్లు నాలుగైదు రోజుల్లోనే డిశ్చార్జ్​ అవుతున్నారు. వేరే జబ్బులున్నోళ్లు జాగ్రత్తలు తీసుకోవాలి.  
- డాక్టర్​ కిరణ్​ మాదాల, అసోసియేట్​ ప్రొఫెసర్​‌‌‌‌, నిజామాబాద్ గవర్నమెంట్​ మెడికల్​ కాలేజీ