రిజర్వేషన్లు 65% కుదరదు .. బిహార్​లో రిజర్వేషన్లపై పాట్నా హైకోర్టు తీర్పు

రిజర్వేషన్లు 65%  కుదరదు ..  బిహార్​లో రిజర్వేషన్లపై పాట్నా హైకోర్టు తీర్పు

పాట్నా:  బిహార్ లో సీఎం నితీశ్ కుమార్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. బీసీలు, ఈబీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు 50 శాతం ఉన్న రిజర్వేషన్లను 65 శాతానికి పెంచడాన్ని పాట్నా హైకోర్టు రద్దు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టంతో రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు విధించిన 50 శాతం పరిమితి దాటుతోందని తెలిపింది. బీహార్ లో జేడీయూ ప్రభుత్వం 2023 నవంబర్ లో ఈ చట్టాన్ని తెచ్చింది. దీనిపై పాట్నా హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వాదనలు విన్న హైకోర్టు మార్చిలో తీర్పు రిజర్వ్ చేసింది. గురువారం చీఫ్​ జస్టిస్​ వినోద్​ చంద్ర, జస్టిస్​ హరీశ్​కుమార్​తో కూడిన బెంచ్​ తీర్పు వెల్లడించింది. 65 శాతానికి రిజర్వేషన్ల పెంపు రాజ్యాంగ విరుద్ధమంటూ చట్టాన్ని కొట్టి వేసింది. ఇది ఆర్టికల్స్ 14, 15, 16లలోని నిబంధనలను ఉల్లంఘిస్తుందని స్పష్టం చేసింది. 

కులగణన టైమ్​లోనూ ఇలాగే అడ్డంకులు: ఆర్జేడీ 

ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో బీసీలు, ఈబీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు రిజర్వేషన్లను 65 శాతానికి పెంచుతూ 2023 నవంబర్​లో బీహార్​ అసెంబ్లీ ఏకగ్రీవంగా చట్టాన్ని ఆమోదించింది. ఆ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం గెజిట్​ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. దీనిపై పాట్నా హైకోర్టులో పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. వాదనలు విన్న హైకోర్టు మార్చిలో తీర్పు రిజర్వ్​ చేసింది. తాజాగా చట్టాన్ని కొట్టేస్తూ తీర్పును వెల్లడించింది. ఈ సందర్భంగా జేడీయూ సీనియర్ నేత, రాష్ట్ర మంత్రి అశోక్ చౌదరి మాట్లాడుతూ.. హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం స్టడీ చేసి సుప్రీంకోర్టులో సవాల్ చేస్తుందని వెల్లడించారు. ఆర్జేడీ రాజ్యసభ ఎంపీ మనోజ్ కుమార్ ఝా స్పందిస్తూ హైకోర్టు తీర్పు దురదృష్టకర పరిణామమని అన్నారు. 

“ఇలాంటి తీర్పులు సామాజిక న్యాయం కోసం చేసే మన ప్రయత్నాన్ని మరింత తీవ్రతరం చేస్తాయి. రిజర్వేషన్ల పెంపు కోసం తమిళనాడు చాలా ఏండ్లు పోరాడవలసి వచ్చింది. దాన్ని గుర్తు చేసుకొంటూ మేం కూడా అలాగే పోరాడుతం. అయితే ఈ పిటిషనర్ల సామాజిక నేపథ్యం ఏమిటో కూడా తప్పనిసరిగా చూడాలి. వారి వెనకుండి ఇదంతా నడిపిస్తున్నది ఎవరో తెలుసుకోవాలి. కులగణన సమయంలోనూ ఇలాంటి అడ్డంకులను చూశాం” అని ఆయన  అన్నారు. ‘‘కేంద్రంలో ఎన్​డీయే ప్రభుత్వం అధికారంలో ఉంది. నితీశ్ కుమార్​ అందులో కీలకమైన భాగస్వామి. అందుకే ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లి రాష్ట్రంలోని మెజార్టీ ప్రజల హక్కులను సాధించాలి” అని కోరారు.