రాష్ట్ర విభ‌‌జ‌‌న తీరు మాన‌‌ని గాయం..కాక్రోచ్‌‌ పార్టీని చూస్తే  చలిచీమల పద్యం గుర్తుకొస్తున్నది: పవన్ కళ్యాణ్

రాష్ట్ర విభ‌‌జ‌‌న తీరు మాన‌‌ని గాయం..కాక్రోచ్‌‌ పార్టీని చూస్తే  చలిచీమల పద్యం గుర్తుకొస్తున్నది: పవన్ కళ్యాణ్
  • ప్రజల మధ్య విద్వేషాలకు ఇదే కారణం: పవన్‌‌ కల్యాణ్‌‌
  • ఇంకా ప్రజల్లో అశాంతి, అసంతృప్తి ఉన్నాయి
  • తెలంగాణ ఏర్పాటును జనసేన వ్యతిరేకించలేదు
  • దేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులతో పోరాడుతాం
  • పార్టీ కంటే దేశ సమగ్రతకే మా ప్రాధాన్యంకాక్రోచ్‌‌ పార్టీని చూస్తే 
  • చలిచీమల పద్యం గుర్తుకొస్తున్నది
  • బలమైన పామును కూడా అవి చంపేస్తాయని కామెంట్‌‌

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై జనసేన చీఫ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్  మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.  రాష్ట్ర విభ‌‌న తీరు ఈనాటికీ మాన‌‌ని ఓ గాయమని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని సక్రమంగా విభజించలేదని, ఇదే రెండు రాష్ట్రాల ప్రజల మధ్య ప్రతిసారి విద్వేషాలను రెచ్చగొట్టడానికి కారణం అవుతున్నదన్నారు. ఢిల్లీ వేదికగా సోమవారం జనసేన పార్టీ ‘జాతీయ సమైక్యత కోసం.. సేన ప్రస్థానం’ పేరిట సమావేశం నిర్వహించింది. ఈ ప్రోగ్రాంలో ఏపీ, తెలంగాణ, ఏపీ,  కేరళ, కర్నాటక రాష్ట్రాల నుంచి ముఖ్య నేతలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్  మాట్లాడుతూ.. ‘‘మొదటి నుంచి తెలంగాణ ఏర్పాటును జనసేన వ్యతిరేకించలేదు. తెలంగాణ ఏర్పాటుకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించిన తీరునే విమర్శించాం. ఉన్నతంగా, గౌరవంగా ఇవ్వాల్సిన రాష్ట్రాన్ని అసంబద్ధంగా ఇచ్చారు. దీంతో ఇప్పటికీ విభజన, ఆస్తుల పంపకంలాంటి సమస్యలున్నాయి. రాష్ట్రాన్ని సక్రమంగా ఇవ్వలేదని తెలంగాణ ప్రజలు ఇప్పటికీ భావిస్తున్నారు. అప్పట్లో సక్రమంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించని తీరునే నేను పదేపదే ప్రస్తావిస్తాను. మొన్నటికి మొన్న తెలంగాణలో జనసేన ఏర్పాటు చేసిన సభకు అనుమతి ఇవ్వలేదు.  దేశానికి, జాతి సమగ్రతకు ద్రోహం చేసే ఎవరినైనా జనసేన వ్యతిరేకిస్తుంది’’ అని పేర్కొన్నారు.

12 ఏండ్లైనా అమరులను గుర్తించలే..

తెలంగాణ కోసం 1200 మంది అమరులయ్యారని, వారి ప్రాణ త్యాగాలను ఇంకా ఎన్నేండ్లకు గుర్తిస్తారని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. తెలంగాణ యువతపై తనకు గౌరవం ఉందన్నారు. తెలంగాణ ఏర్పాటు సమయంలో జరిగిన బలిదానాలు తనను కలిచివేశాయని చెప్పారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై 12 ఏండ్లు అయిందని, అయినా అమరవీరులను గుర్తించలేకపోయారన్నారు. అమరుల గౌరవార్థం హైదరాబాద్‌‌లో సభ పెట్టేందుకు పర్మిషన్ అడిగితే ఇవ్వలేదని మండిపడ్డారు. అమరులకు నివాళులర్పించేందుకు అనుమతి కావాలా? అని నిలదీశారు. తెలంగాణ ఉద్యమం తనలో స్ఫూర్తిని నింపిందని, ఆ రాష్ట్రం కోసం జనసేన తన వంతు కృషి చేస్తుందని తెలిపారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తోందని విమర్శించారు. 12 ఏండ్ల పోరాటమే తమ ఊపిరిగా బతికామన్నారు. క్రిమినల్ పార్టీలతో తాము పోరాడామని వైసీపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.‘‘తెలంగాణ నా నేల కాదా?, నా దేశం  కాదా?” అని ప్రశ్నించారు. 

ముందుండి పోరాడుతాం

దేశ సమగ్రత, సమైక్యతకు ఏ ఆటంకం వచ్చినా జనసేన పార్టీ ముందుండి పోరాడుతుందని పవన్‌‌ కల్యాణ్‌‌ తెలిపారు. ‘‘అధికార కాంక్ష లేకుండా కేవలం దేశభక్తి, దేశ శ్రేయస్సే లక్ష్యంగా ప్రారంభమైన జనసేన పార్టీ, ఎన్నో సవాళ్లు, -పరాజయాలను అధిగమించి నేడు 20 లక్షల మంది సైన్యంతో బలమైన శక్తిగా ఎదిగింది” అని అన్నారు. 536 సంస్థానాలతో ఉన్న దేశాన్ని ఐక్యం చేయడానికి దేశ మొదటి హోంమంత్రి వల్లభాయ్ పటేల్ శ్రమ అంతా ఇంతా కాదని, ఆ సమయంలోనే పటేల్ దేశ సమగ్రతను కాపాడుకోవడం దేశానికి మొదటి ప్రాధాన్యం అని చెప్పారన్నారు.

ఆయన చెప్పిన మాటను జనసేన అనుసరిస్తుందని, ఆచరిస్తుందని తెలిపారు. ఈ క్రమంలో జనసేన ఎంపీలు కేవలం తమ నియోజకవర్గాలకే పరిమితం కాకుండా, రాజ్యాంగ స్ఫూర్తితో దేశ ప్రతిష్ట, సమగ్రతను కాపాడే అంశాలపై పార్లమెంట్‌‌లో బలంగా గళం విప్పాలని పిలుపునిచ్చారు.  ప్రతి వ్యక్తి కూడా సమాజంలో మార్పు తీసుకురావొచ్చని పవన్‌‌ కల్యాణ్‌‌ పేర్కొన్నారు. ‘‘ఈ మధ్య కాక్రోచ్‌‌ పార్టీ ఎలా పుట్టుకొచ్చిందో చూస్తున్నాం. ఆ పార్టీని చూస్తుంటే చలిచీమల పద్యం గుర్తొచ్చింది. చలిచీమలు కూడా బలమైన పామును చంసేస్తాయి” అని వ్యాఖ్యానించారు.