- స్వచ్ఛ గోదావరి థీమ్‌తో నిర్వహించే పుష్కరాలకు సహకరించండి
- కేంద్ర మంత్రులకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విజ్ఞప్తులు
న్యూఢిల్లీ, వెలుగు: నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో బేస్ క్యాంపులు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కోరారు. ప్రస్తుతం ఉన్న 90 బేస్ క్యాంపులను150కి పెంచుకోవాల్సి ఉందన్నారు. అందుకోసం 300 మంది గార్డ్స్ అదనంగా అవసరం అవుతారని కేంద్ర మంత్రికి వివరించారు. ఆ సిబ్బంది అడవుల్లో సులభంగా తిరిగేందుకు ద్విచక్ర వాహనాలు సహా బేస్ క్యాంపుల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వ పథకాల నుంచి సాయం చేయాలని కోరారు.
ఢిల్లీ పర్యటనలో భాగంగా మంగళవారం ధర్మేంద్ర ప్రధాన్‌తోపాటు కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్, పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో కూడా పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. నమామి గంగే ప్రాజెక్టు తరహాలో క్లీన్ గోదావరి ప్రాజెక్టు చేపట్టి నది ప్రక్షాళనకు కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరారు. వచ్చే ఏడాది స్వచ్ఛ గోదావరి పవిత్ర పుష్కరాలు థీమ్‌తో పుష్కరాలు చేపడుతున్నామని చెప్పారు.
త్వరలో తెలంగాణలో చేరికలపై కమిటీ..
తెలంగాణలో జనసేన పార్టీలో చేరికల సమన్వయానికి జాయినింగ్స్ కమిటీని వేయనున్నట్లు ఆ పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన కార్యాలయం ఒక ప్రకటన రిలీజ్ చేసింది. జనసేనలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్న ఇతర పార్టీల నేతలు, విద్యావంతులు, సామాజికవేత్తలు, తటస్థులను పార్టీలోకి ఆహ్వానించేందుకు ప్రత్యేకంగా జాయినింగ్స్ కమిటీని నియమిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. తాజాగా 14 మంది సభ్యులతో ఏపీలో చేరికల సమన్వయం కోసం కమిటీ వేసినట్లు వెల్లడించారు.
