పొత్తులు పెట్టుకుంటాం.. వైసీపీని గద్దె దింపుతాం

పొత్తులు పెట్టుకుంటాం.. వైసీపీని గద్దె దింపుతాం

వైసీపీ నుంచి అధికారం తీసేసుకోవాలి..  ప్రజలకు అప్పగించాలన్నదే తమ లక్ష్యమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్  వెల్లడించారు. వైసీపీకి వ్యతిరేకంగా ఉండే ఇతర పార్టీలను ఒప్పించి ఎన్నికల్లో కలిసి వెళ్తామని  తెలిపారు. తాము కూడా  కర్నాటకలో కుమారస్వామి తరహాలో 30 నుంచి 40 సీట్లు గెలిచి ఉంటే బావుండేదంటూ పవన్ వ్యాఖ్యానించారు. ముందస్తు ఎన్నికలు వస్తే జూన్ నుంచి క్షేత్రస్ధాయి పర్యటనలు చేస్తామన్నారు. గతంలో 137 స్థానాల్లో పోటీచేశామంటూ.. అప్పుడు కొన్ని స్థానాల్లో గెలిచి ఉంటే నేడు బలంగా ఉండేవారమన్నారు.    

పొత్తులు పెట్టుకుంటాం..

వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వబోనని మరోసారి పవన్ స్పష్టం చేశారు. తమకు పట్టున్న ప్రాంతాల్లో 30 శాతం వరకూ ఓటు బ్యాంకు ఉందని,... సగటున 7 శాతం ఓటు బ్యాంకు ఉండటం సాధారణమైన విషయం కాదన్నారు. తాను ముఖ్యమంత్రి కావడం గురించి ఆలోచించలేదని అన్నారు. పొత్తులు తప్పుకాదని, బీఆర్ఎస్ కూడా ఇప్పుడు పొత్తులతోనే బలపడిందని గుర్తుచేశారు. 2014లో లోతుగా చర్చించాకే టీడీపీ, బీజేపీలకు మద్దతిచ్చానన్నారు. పొత్తులనేవి ఓ కులానికి సంబంధించినవి కావని రాష్ట్రానికి సంబంధించినవని.. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించినవని పవన్ తెలిపారు. సీఎం అయ్యే పరిస్ధితి ఉంటేనే పొత్తు పెట్టుకోవాలని అనడం సరికాదన్నారు. 

సినిమాల్లో సూపర్ స్టార్ హోదా

వ్యక్తిగత అవసరాల కోసం పార్టీ పెట్టలేదని.. రాష్ట్ర ప్రయోజనాలకోసం పార్టీని స్థాపించానన్నారు.  ప్రజలకు అధికారం అప్పగించడమే తన ధ్యేయమన్నారు.  విమర్శలు లేకుండా రాజకీయం ఉండదంటూనే  బలం చూపి పదవి తీసుకోవాలన్నారు.  సినిమాల్లో సూపర్ స్టార్ హోదా తెచ్చుకున్నానని... ప్రజల కోసం ఎవరెన్ని మాటలన్నా పడతానన్నారు.  రాజకీయాల్లో అందరినీ కలుపుకుని వెళ్లాలనే తాను భావిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. కమ్యూనిస్టులతో ఉన్నప్పుడు బీజేపీ, బీజేపీతో ఉన్నప్పుడు కమ్యూనిస్టులు తనను తిట్టుకుంటున్నారని పవన్ పేర్కొన్నారు.